ఆహా.. అనేలా ప్రణాళిక ! | - | Sakshi
Sakshi News home page

ఆహా.. అనేలా ప్రణాళిక !

Aug 3 2026 12:55 AM | Updated on Aug 3 2026 12:55 AM

● నివేదికలు, క్లియరెన్స్‌ల పేరిట కాలయాపన ● ప్రతిపాదనలకే పరిమితమైన రింగ్‌ రోడ్డు, బఫర్‌ జోన్లు ఆర్భాటంగా ప్రకటనలు ఊహల్లోనే రింగ్‌ రోడ్డు కాగితాలపైనే భద్రం ఆక్రమణల చెరలో చెరువులు లేఖలు.. సమాధానాలు తిరస్కరించకుండా..

‘సుడా’ మాస్టర్‌ప్లాన్‌ అమల్లో మాత్రం జాప్యం
● నివేదికలు, క్లియరెన్స్‌ల పేరిట కాలయాపన ● ప్రతిపాదనలకే పరిమితమైన రింగ్‌ రోడ్డు, బఫర్‌ జోన్లు

ఖమ్మంమయూరిసెంటర్‌: ఖమ్మం నగర రూపురేఖలను మార్చేసి, రాబోయే తరాలకు అద్భుతమైన వసతులు కల్పిస్తామంటూ పాలకులు హంగూఆర్భాటంతో ప్రకటించిన బృహత్‌ ప్రణాళిక(మాస్టర్‌ ప్లాన్‌) అడుగు ముందుకు పడడం లేదు. 2047 నాటి జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకుని స్తంభాద్రి పట్టణాభివృద్ధి సంస్థ(సుడా), ఖమ్మం నగరపాలక సంస్థ(కేఎంసీ)లు కలిసి మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పనకు శ్రీకారం చుట్టాయి. అయితే, ముసాయిదా కాగితాలకే పరిమితమవుతుందే తప్ప ఆచరణలో ముందుకు సాగడం లేదు.

భవిష్యత్‌ అవసరాల కోసం 2021 నుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నామని అధికారులు చెబుతుండగా.. కాలం కరిగినంత వేగంగా పనుల్లో కనిపించడం లేదు. ‘సుడా’ పరిధిలో 57,183.43 చదరపు హెక్టార్లు, కేఎంసీ పరిధిలో 9,443.62 చదరపు హెక్టార్ల విస్తీర్ణంతో భారీ లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. ముసాయిదా ప్రణాళికలను నోటీసు బోర్డులపై ప్రదర్శించాక తదుపరి చర్యలపై పాలకవర్గానికి స్పష్టత కరువైందనే విమర్శలు వస్తున్నాయి.

జిల్లా మీదుగా వెళ్లే జాతీయ రహదారులను కలుపుతూ రింగ్‌ రోడ్డు నిర్మించాలన్న కీలక ప్రతిపాదన ఆచరణ రూపం దాల్చడం లేదు. ఆరెంపుల, ఎం.వీ.పాలెం, రేగులచెలక, వీ.వీ.పాలెం, బస్సాపురం, గుదిమల్ల, తెల్దారుపల్లి, తల్లాంపాడు తదితర గ్రామాలను కలుపుతూ రింగ్‌ రోడ్డు నిర్మించాలనే ప్రతిపాదన అమలైతే పెరుగుతున్న ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. నగరం చుట్టూ హైవేలు పూర్తయితే కొద్దిమేర రింగ్‌రోడ్‌ నిర్మిస్తే చాలని తెలిసినా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు.

బృహత్‌ ప్రణాళికలో భూముల కేటాయింపులను భారీ స్థాయిలో చూపించారు. నివాస గృహాల కోసం ‘సుడా’ పరిధిలో 16 వేల హెక్టార్లకు పైగా, కేఎంసీ పరిధిలో 5వేల హెక్టార్లకు పైగా కేటాయించారు. అలాగే, పారిశ్రామిక జోన్లు, గ్రోత్‌ కారిడార్ల కోసం వేల హెక్టార్లను ప్రతిపాదించారు. ప్రభుత్వ సంస్థలు, విద్యా, పరిశోధన, వైద్యారోగ్యం, సామాజిక, సాంస్కృతిక అవసరాలతో పాటు శ్మశానవాటికల కోసం కూడా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ నిధుల కొరత, పాలకుల చిత్తశుద్ధి లేమి కాారణంగా ఇవేవీ ఆచరణకు నోచుకోక కాగితాలకే పరిమితమయ్యాయి.

నగరంలో వాగులు, చెరువుల సంరక్షణ కోసం సుడా పరిధిలో 1,916.74 చదరపు హెక్టార్లు, కేఎంసీ పరిధిలో 255.92 చదరపు హెక్టార్లను బఫర్‌ జోన్లుగా ప్రకటించారు. అంతేకాక పంట కాల్వలు, సర్కారు భూములను కాపాడడానికి సరిహద్దులు గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే, క్షేత్రస్థాయిలో ఆక్రమణలు యథేచ్ఛగా కొనసాగుతూనే ఉన్నాయి. అలాగే, 30 అడుగులు ఉన్న అంతర్గత రహదారులను 40 అడుగులకు, 80 అడుగుల రోడ్లను 100 అడుగులకు విస్తరిస్తామని ప్లాన్‌లో పేర్కొన్నారు. ఈ ప్లాన్‌ అమలైతే ఆక్రమణలు వెలుగులోకి రావడంతో పాటు రోడ్ల విస్తరణ జరిగి రాకపోకలకు సాఫీగా సాగుతాయి.

మాస్టర్‌ ప్లాన్‌ ప్రక్రియ ఆలస్యమవడానికి గల సాంకేతిక, పరిపాలనాపరమైన అంశాలపై అధికార, పాలకవర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో ఉన్న కొన్ని కాల్వలు, నాలాలు ప్రస్తుతం లేవని, వాటి స్థానంలో రహదారులు నిర్మించగా.. కొంత మేర ఆక్రమణలు జరిగాయని అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ కాల్వల ప్రస్తుత పరిస్థితిపై స్పష్టమైన నివేదిక ఇవ్వాలని కోరుతూ ఇరిగేషన్‌ చీఫ్‌ ఇంజనీర్‌కి సుడా అధికారులు లేఖ రాసినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆ కాల్వల్లో నీటి పారకం లేకపోగా.. ఆయకట్టులో పంటలు కూడా లేవు. ఆయా ప్రదేశాల్లో కొన్ని చోట్ల గుడిసెలు వేసి ఆక్రమించినట్లు తెలిసింది. మరికొన్ని చోట్ల మున్సిపల్‌ పార్కులను ఏర్పాటు చేశారు. అయితే, ‘సుడా’ మాస్టర్‌ ప్లాన్‌పై గతంలో ఉన్న కోర్టు కేసులు దాదాపు పరిష్కారమైన నేపథ్యాన అనుకూల వాతావరణంలోనే ప్రక్రియ ముందుకు సాగుతోందని చెబుతున్నా.. ఎప్పటికి అమలవుతుందో మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు.

మాస్టర్‌ ప్లాన్‌ నివేదికను ప్రభుత్వానికి సమర్పించినప్పుడు కాల్వలు, నాలాలు, వాటి స్థానంలో వచ్చిన రోడ్లపై కచ్చితమైన వివరాలు అడుగుతారని భావించి అధికారులు ముందుగా సిద్ధమవుతున్నట్లు తెలిసింది. సరైన నివేదికలు, ఆధారాలు లేకపోతే తిరస్కరించే అవకాశముండడంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇదంతా పూర్తయి, ఇరిగేషన్‌ సీఈ నివేదిక ఇస్తే 10 రోజుల్లో ప్రభుత్వానికి పంపి తుది అనుమతి తీసుకునేలా కసరత్తు చేస్తున్నారు. ఈ విషయమై ‘సుడా’ ప్రణాళిక విఽభాగం అధికారిని వివరణ కోరగా.. నీటి పారుదల కాల్వలకు సంబంధించి స్పష్టమైన నివేదిక రాగానే మాస్టర్‌ ప్లాన్‌ తుది ఆమోదం కోసం ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement