పాలన వ్యవహారాలపై దృష్టి
● సంక్రాంతి నాటికి వేయి ఇందిరమ్మ ఇళ్ల పూర్తి ● అధికారులతో సమీక్షలో కలెక్టర్ అనుదీప్
ఖమ్మం సహకారనగర్: గ్రామపంచాయతీ ఎన్నికలు, కొత్త పాలకవర్గాల ప్రమాణ స్వీకారం ముగిసినందున అధికారులు ఇక నుంచి పాలనా వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. తొలుత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించిన అధికారులను అభినందించారు. అనంరం కలెక్టర్ మాట్లాడుతూ గురుకులాలు, పాఠశాలలతో పాటు అభివృద్ధి పనులను జిల్లా అధికారులు తనిఖీ చేయాలని తెలిపారు. వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ఆస్పత్రుల్లో వైద్యుల హాజరును బయోమెట్రిక్ విధానంలో నమోదు చేయించాలని, విధుల సమయాన వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయకుండా చూడాలని సూచించారు. కాగా, సంక్రాంతి నాటికి జిల్లా పరిధిలో కనీసం వేయి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయించాలని తెలిపారు. ఇప్పటికే 250 ఇళ్లు పూర్తికాగా, 6,700 ఇళ్లకు స్లాబ్ పడినందున మిగతా పనుల్లో వేగం పెంచేలా పర్యవేక్షించాలని చెప్పారు. అలాగే, ఈనెల 24న విద్యా శాఖ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ సంక్షేమ శాఖలపై డిప్యూటీ సీఎం సమీక్షించనున్నట్లు అధికారులు నివేదికలతో హాజరుకావాలని కలెక్టర్ సూచించారు.
●ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగుతోందని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. జిల్లాలోని 331 కేంద్రాల ద్వారా 43,236 మంది రైతుల నుంచి రూ.601 కోట్ల విలువైన 2.51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఇందులో 37,373 మంది రైతులకు రూ.530 కోట్ల చెల్లింపులు పూర్తయ్యాయని తెలిపారు.
●ఇప్పటివరకు తెలియని పర్యాటక ప్రదేశాలను ప్రపంచానికి చాటేలా వివరాలు పంపించాలని కలెక్టర్ అనుదీప్ సూచించారు. ‘100 వీకెండ్ వండర్స్ ఆఫ్ తెలంగాణ’ పోటీల పోస్టర్లను ఆవిష్కరించిన ఆయన మాట్లాడుతూ ప్రతీ ప్రదేశం మూడు ఫొటోలు, 60 సెకన్ల వీడియో, 100 పదాలతో వివరాలను జనవరి 5వ తేదీలోగా https://FORMS. GLE/VVJB7NZWBUZ7WW.JY కు పంపిస్తే విజేతలను ప్రకటిస్తారని తెలిపారు.
●స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్) ఓటర్ జాబితా పకడ్బందీగా తయారు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై కలెక్టర్లతో ఎన్నికల సంఘం రాష్ట్ర సీఈఓ సుదర్శన్‌రెడ్డి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అనంతరం అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో పాటు అధికారులతో సమావేశమైన కలెక్టర్ సూచనలు చేశారు. జిల్లా ఓటరు జాబితాలో 40ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వారు, అంత కంటే ఎక్కువ వయస్సు వారి జాబితా వేరుచేయాలని తెలిపారు. ఈ జాబితాను 2002లో నిర్వహించిన జాబితా ఆధారంగా సరిపోల్చుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఇదంతా పోలింగ్ బూత్‌ల వారీగా జరగాలని సూచించారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
ఖమ్మంమయూరిసెంటర్: ప్రభుత్వ వ్యవస్థపై నమ్మకాన్ని పెంచచడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఉద్యోగులు జవాబుదారీతనంతో పనిచేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. బీసీ స్టడీసర్కిల్‌లో శిక్షణ తీసుకుని గ్రూప్–3, 4లో ఉద్యోగాలు సాధించిన పలువురు కలెక్టర్‌ను కలవగా ఆయన అభినందించి మాట్లాడారు. ప్రభుత్వ బీసీ స్టడీ సర్కిల్‌లో శిక్షణ తీసుకుంటూ పట్టుదలతో చదివి విజయం సాధించడం అభినందనీయమన్నారు. ఈ సమావేశాల్లో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, డీఆర్‌ఓ ఏ.పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, డీఎం శ్రీలత, డీఏఓ పుల్లయ్య, జిల్లా టూరిజం అధికారి సుమన్‌చక్రవర్తి, జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారి జి.జ్యోతి, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.


