ఈనెల 15న సూపర్ లోక్ అదాలత్
ఖమ్మం లీగల్: పెండింగ్ కేసుల పరిష్కారమే లక్ష్యంగా ఈనెల 15న సూపర్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ తెలిపారు. జిల్లా కోర్టులో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా సోమవారం నుంచి ఈనెల 15వ తేదీ వరకు చెక్ బౌన్స్ కేసులు, రోడ్డు ప్రమాద బీమా కేసులు, రాజీ పడదగిన సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరించుకోవచ్చని వెల్లడించారు. ఈమేరకు 5,536 చెక్ బౌన్స్ కేసులు, 3,651 క్రిమినల్ కాంపౌండ్ కేసులు పరిష్కరించేలా నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. అంతేకాక ఖమ్మం, మధిర, సత్తుపల్లి కోర్టుల్లో 15 బెంచ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేక లోక్ అదాలత్‌లో అత్యధిక కేసుల పరిష్కారమే లక్ష్యంగా ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. అంతేకాక న్యాయవాదులు, కక్షిదారులు, బీమా కంపెనీ ప్రతినిధులు, బ్యాంక్, పోలీసు అధికారులతో ఖమ్మం న్యాయ సేవాధికారి సంస్థ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్జి రాజగోపాల్ వెల్లడించారు. ఈ సమావేశంలో న్యాయధికారులు కె, ఉమాదేవి, వెంపటి అపర్ణ, ఎం.అర్చనాకుమారి, దేవినేని రాంప్రసాదరావు, ఎం.కల్పన, వి.శివరంజని, టి.మురళీమోహన్, కాసరగడ్డ దీప, బెక్కం రజని, ఏపూరి బిందు ప్రియ, వినుకొండ మాధవి, బి.నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


