మణుగూరులో ఉద్రిక్తత | - | Sakshi
Sakshi News home page

మణుగూరులో ఉద్రిక్తత

Nov 3 2025 6:46 AM | Updated on Nov 3 2025 6:46 AM

మణుగూరులో ఉద్రిక్తత

మణుగూరులో ఉద్రిక్తత

● బీఆర్‌ఎస్‌ కార్యాలయంపై కాంగ్రెస్‌ శ్రేణుల దాడి ● ఫర్నిచర్‌ను బయట పడేసి నిప్పంటించిన వైనం ● పట్టణంలో 144 సెక్షన్‌ విధించిన పోలీసులు ● పదేళ్ల తర్వాత ఆఫీస్‌ దక్కించుకున్నామంటున్న కాంగ్రెస్‌

సంయమనం పాటించండి

● బీఆర్‌ఎస్‌ కార్యాలయంపై కాంగ్రెస్‌ శ్రేణుల దాడి ● ఫర్నిచర్‌ను బయట పడేసి నిప్పంటించిన వైనం ● పట్టణంలో 144 సెక్షన్‌ విధించిన పోలీసులు ● పదేళ్ల తర్వాత ఆఫీస్‌ దక్కించుకున్నామంటున్న కాంగ్రెస్‌

మణుగూరు రూరల్‌: మణుగూరులో ఆదివారం హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా తరలివచ్చి బీఆర్‌ఎస్‌ కార్యాలయం(తెలంగాణ భవన్‌)లోని ఫర్నిచర్‌ను, ఫ్లెక్సీలు, పార్టీ జెండాలను బయట పడేసి పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. ఎగిసిపడిన అగ్నికీలలతో విద్యుత్‌ వైర్లు తెగిపడ్డాయి. కాంగ్రెస్‌ రంగులు వేసి కార్యాలయంపై జెండా ఎగురవేశారు. దీంతో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అక్కడకు చేరుకుని ప్రశ్నించారు. ఈక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్‌ కార్యకర్తలు పిడిగుద్దులతో దాడి చేయగా పలువురు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు గాయాలయ్యా యి. ఓఎస్డీ నరేందర్‌, మణుగూరు డీఎస్పీ వి.రవీందర్‌రెడ్డి, సీఐ నాగబాబు, అశ్వాపురం సీఐ అశోక్‌రెడ్డిలు సిబ్బందితో అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఉద్రిక్త పరిస్థితి కొనసాగింది. ఆ తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. వందలాది మంది కాంగ్రెస్‌ కార్యకర్తలు రావడంతో పోలీసులు కూడా చాలా సేపు నిలువరించలేకపోయారు. అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్‌తో మంటలను ఆర్పివేశారు.

మణుగూరులో 144 సెక్షన్‌

ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా మణుగూరులో 144 సెక్షన్‌ విధించారు. ఈ మేరకు డీఎస్పీ రవీందర్‌రెడ్డి, తహసీల్దార్‌ అద్దంకి నరేష్‌ ఉత్తర్వులు జారీ చేశారు. పట్టణంలో పోలీసు బలగాలు భారీగా మోహరించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రజలెవరూ గుంపులు గుంపులుగా తిరగరాదని, నలుగురికి మించి వ్యక్తులు ఒకేచోట ఉండకూడదని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇందిరమ్మ భవనంగా మారిన తెలంగాణ భవన్‌!

రేగా కాంతారావు పార్టీ మారినప్పుడు కాంగ్రెస్‌ కార్యాలయ భవనాన్ని సైతం కబ్జా చేశాడంటూ పలు సందర్భాల్లో కాంగ్రెస్‌ నాయకులు విమర్శలు చేశారు. 2019కి ముందు ఇదే భవనంలో కాంగ్రెస్‌ పార్టీ కార్యకలాపాలు కొనసాగాయి. క్రమంగా తెలంగాణ భవన్‌ పేరుతో బీఆర్‌ఎస్‌ పట్టణ కార్యాలయంగా మారింది. తాజాగా కాంగ్రెస్‌లు శ్రేణులు తెలంగాణ భవన్‌ను ఇందిరమ్మ భవన్‌గా మార్చి హస్తం ముద్రలు వేశారు.

రేగా కాంతారావు ఆక్రమించుకున్నాడు: కాంగ్రెస్‌

కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన రేగా కాంతారావు ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరాడని, కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాన్ని కూడా ఆక్రమించాడని కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆరోపించారు. అనంతరం బీఆర్‌ఎస్‌ కార్యాలయంగా మార్చాడని, అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని పేర్కొన్నారు. అప్పుడు బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండటంతో కార్యాలయాన్ని దక్కించుకోలేకపోయామని, ప్రస్తుతం తమ పార్టీ అధికారంలో ఉండటంతో కార్యాలయాన్ని దక్కించుకున్నామని తెలిపారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.

బీఆర్‌ఎస్‌ ఆందోళన

బీఆర్‌ఎస్‌ కార్యాలయంపై కాంగ్రెస్‌ నాయకులు గూండాల్లా దాడి చేశారని బీఆర్‌ఎస్‌ నాయకులు ఆరోపించారు. దాడిని ఖండిస్తూ పట్టణ ప్రధాన రహదారిపై ఆందోళన నిర్వహంచారు. దాడికి పాల్పడిన కాంగ్రెస్‌ నాయకులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు

కార్యకర్తలపై దాడి చేసి కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోవడం పిరికిపంద చర్యగా బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పేర్కొన్నారు. సమాచారం తెలుసుకుని హైదరాబాద్‌ నుంచి మణుగూరు చేరుకున్న ఆయన అంబేద్కర్‌ సెంటర్‌లో విలేకరులతో మాట్లాడారు. ఒక దెబ్బ కొడితే తిరిగి 10 దెబ్బలు కొట్టే సత్తా తమకు ఉందని అన్నారు. తమ దగ్గర ఉన్న ఆధారాలతో పోలీసుల సమక్షంలో తేల్చుకుంటామని, కార్యకర్తలు సంయమనం పాటించాలని సూచించారు. కాంగ్రెస్‌ నాయకులు జూబ్లీహిల్స్‌లో ఓడిపోతామనే భయంతో మణుగూరులో కార్యాలయం ఫర్నిచర్‌ ధ్వంసం చేశారని ఆరోపించారు. నియోజకవర్గంలో రోడ్లకు మరమ్మతులు చేయడంలేదని, ముగ్గురు మంత్రులు ఉన్న ఉమ్మడి జిల్లాలో రూ. వందల కోట్ల డీఎంఎఫ్‌టీ నిధులు పక్కదారి పడితున్నాయని ఆరోపించారు.

ఆ భవనం కాంగ్రెస్‌ కార్యకర్తల కష్టార్జితం

ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

మణుగూరు టౌన్‌: ఆ భవనం కాంగ్రెస్‌ కార్యకర్తల కష్టార్జితమని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ప్రజాభవన్‌లో డీసీసీసీ అధ్యక్షుడు పొదెం వీరయ్యతో కలిసి ఆయన మాట్లాడారు. రేగా కాంతారావు వద్ద ఉన్నవి ఫేక్‌ ఆధారాలని పేర్కొన్నారు. ఇందిరమ్మ భవన్‌గా ఉన్న కాంగ్రెస్‌ కార్యాలయాన్ని రంగులు మార్చి కాంతారావు కబ్జా చేశాడని ఆరోపించారు. ఓపికతో వేచి చూసిన కాంగ్రెస్‌ కార్యకర్తలు ఎంతో క్రమశిక్షణతో తమ కార్యాలయాన్ని తాము స్వాధీనం చేసుకునేందుకు వెళ్తే దాడులు చేసి గందరగోళాన్ని సృష్టించడాన్ని బీఆర్‌ఎస్‌ విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. కాంతారావుది గుండాలా భయభ్రాంతులకు గురి చేసే వ్యాఖ్యలు చేసే వ్యక్తిత్వమని విమర్శించారు. అది కాంగ్రెస్‌ కార్యాలయమేనని, రేపు మీడియాకు ఆధారాలు చూపుతామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement