రూ.30 లక్షల విలువైన గంజాయి ఆయిల్ స్వాధీనం
రఘునాథపాలెం: ఇద్దరు వ్యక్తులు 70గ్రాముల గంజాయి ఆయిల్ తీసుకెళ్తూ పట్టుపడగా రఘునాథపాలెం పోలీసులు లోతుగా విచారించడంతో భారీగా ఆయిల్ లభ్యమైంది. ఈమేరకు సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపిన వివరాలు... రఘునాథపాలెం సబ్‌స్టేషన్ వెనక ఇద్దరు వ్యక్తులు గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారంతో ఇటీవల తనిఖీ చేపట్టిన పోలీసులు 70గ్రాముల గంజాయి లిక్విడ్ స్వాధీనం చేసుకున్నారు. వీరిని విచారించగా మరికొన్ని ఆధారాలు లభించాయి. దీంతో శనివారం ఆపిల్ సెంటర్ వద్ద చేపట్టిన వాహనాల తనిఖీల్లో కారులో ఖమ్మం వైఎస్సార్‌కాలనీకి చెందిన కొత్తా రాము, ఏపీలోని రాజమండ్రి వాసి జానకీరామయ్య తీసుకెళ్తున్న రూ.30 లక్షల విలువైన 2.395 కేజీల గంజాయి లిక్విడ్(హాషిష్) లభించింది. ఈమేరకు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ తనిఖీల్లో సీఐ ఉస్మాన్ షరీఫ్, ఎస్‌ఐ గజ్జెల నరేష్, సిబ్బంది సంజీవ్, శ్రీనివాస్, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.


