సుపారీ గ్యాంగ్ పనేనా?
● ఏపీలో పథకం రూపొందించినట్లు ప్రచారం ● సీపీఎం నేత హత్య కేసులో పోలీసుల విచారణ
చింతకాని: చింతకాని మండలం పాతర్లపాడులో సీపీఎం సీనియర్ నేత, మాజీ సర్పంచ్ సామినేని రామారావు శుక్రవారం హత్యకు గురికావడం.. ఆయన బంధువులు, పార్టీ నాయకులు కాంగ్రెస్ శ్రేణులపై విమర్శలు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈనేపథ్యాన కేసును త్వరగా చేధించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పోలీసులను ఆదేశించారు. దీంతో పోలీసు కమిషనర్ సునీల్‌దత్ ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటచేయగా కేసు విచారణలో నిమగ్నమయ్యారు. అయితే, సుపారీ గ్యాంగే రామారావును హత్య చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారని సమాచారం. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ రాజధాని సమీపాన ఓ పట్టణంలో పథకం రూపొందించారనే సమాచారంతో పోలీసులు దర్యాప్తు సాగిస్తునట్లు తెలిసింది. ఘటనాస్థలిలో లభించిన చెప్పుల జత, నిందితుడి టీ షర్ట్, హత్యకు వినియోగించిన కత్తి పౌచ్ ఆధారంగా ఆరా తీస్తున్నట్లు సమాచారం. సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామనే భరోసాతో ఉన్నట్లు చెబుతున్నారు. కాగా, గ్రామంలో పోలీస్ పికెటింగ్ శనివారం కూడా కొనసాగింది. ఈమేరకు భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్‌రాజ్ శనివారం సాయంత్రం చింతకానికి వచ్చి పోలీసులతో కేసుపై సమీక్షించారు.


