ఆలయ పునఃనిర్మాణానికి రూ.40లక్షలు
చింతకాని: చింతకాని మండలం లచ్చగూడెంలోని శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయ పునఃనిర్మాణానికి రూ.40 లక్షల నిధులు మంజూరు చేశారు. ఇటీవల డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గ్రామానికి వచ్చిన సందర్భంగా ఆలయ పరిస్థితిని అర్చకుడు ఇంగువ విద్యాసాగర్ శర్మ వివరించారు. దీంతో స్పందించిన భట్టి విక్రమార్క సీజీఎఫ్ నిధుల నుంచి రూ.40లక్షలు మంజూరు చేయగా, ఉత్తర్వుల కాపీని ఆలయ కమిటీ సభ్యులకు ఆత్మ కమిటీ డైరక్టర్ కొప్పుల గోవిందరావు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు డిప్యూటీ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గొడుగు రమేష్, ఆలయ కమిటీ సభ్యులు చొప్పర రంగారావు, వంకాయలపాటి ప్రసాద్, బత్తిన వెంకటేశ్వర్లు, మేకపోతుల నాగేశ్వరరావు, యలమద్ది ప్రసాద్, తాళ్ల రామారావు, కొప్పెర రాంబాబు, గురిజాల నర్సింహారావు, కట్ల కృష్ణయ్య, బోయిన రామారావు, నెర్సుల బక్కయ్య, శ్రీరాముల నాగేశ్వరరావు, జమలయ్య, తదితరులు పాల్గొన్నారు.
ఆర్చరీ క్రీడాకారుల ఎంపిక
పాల్వంచరూరల్: రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి జిల్లా క్రీడాకారులను పాల్వంచ మండలం కిన్నెరసాని గిరిజన స్పోర్ట్స్ మోడల్ స్కూల్‌లో గురువారం ఎంపిక చేశారు. సబ్ జూనియర్ విభాగంలో బాలబాలికల జట్ల ఎంపిక పోటీలు ఉమ్మడి జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యాన నిర్వహించారు. ఈమేరకు వివరాలను అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పుట్టా శంకరయ్య వెల్లడించారు. బాలుర విభాగంలో కె.రాంచరణ్, ఎం.చరణ్, కె.దిలీప్, కె.వినోద్‌కుమార్, వి.సంతోష్, జి.విజయవర్దన్, వెంకటయోగేశ్వర్, డి.ఆదిత్యప్రకాశ్, టి.మోహన్‌రెడ్డి, పి.దేవంత్ స్వామి, శివ శశాంక్, బాలికల విభాగంలో ఇ.అవంతిక, బి.సంజనశ్రీ, పి.హర్షిత, కె.జ్యోత్స్న, ఎం.గౌతమి, జె.సంస్కృతి ఎంపికయ్యారని తెలిపారు.
బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
సత్తుపల్లిరూరల్: తుపాన్ కారణంగా కురిసిన భారీ వర్షంతో సత్తుపల్లి జేవీఆర్ ఓసీ, కిష్టారం ఓసీల్లో నీరు నిలవగా గురువారం కూడా బొగ్గు ఉత్పత్తి, మట్టి వెలికితీతకు అంతరాయం ఏర్పడింది. రెండు ఓసీల్లో సుమారు 40వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విభాగం కలిగిందని పీఓలు ప్రహ్లాద్, నర్సింహారావు తెలిపారు. ఈమేరకు ఓసీల్లో నీటిని తొలగించి బొగ్గు ఉత్పత్తిని పునరుద్ధరించేలా చర్యలు చేపట్టామని వెల్లడించారు.
జర్మనీలో ఉద్యోగాలకు
ఖమ్మంరాపర్తినగర్: తెలంగాణ ఓవర్సీస్ మాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్(టామ్‌కామ్) ద్వారా జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు గురువారం రిజిస్ట్రేషన్లు స్వీకరించారు. ఖమ్మం టేకులపల్లిలోని మోడల్ కెరీర్ సెంటర్‌లో శిబి రం ఏర్పాటుచేయగా 106మంది పేర్లు నమో దు చేసుకున్నారు. వీరికి రెండు రోజుల్లో ఇంటార్వ్యూ నిర్వహిస్తామని జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి కొండపల్లి శ్రీరామ్ తెలిపారు.
దెబ్బతిన్న పంటల పరిశీలన
కామేపల్లి: తుపాన్ కారణంగా దెబ్బతిన్న పంటలను జిల్లా వ్యవసాయాధికారి పుల్లయ్య, అధికారులు గురువారం పరిశీలించారు. కామేపల్లిలోని వాగు వద్ద నీట మునిగిన వరి పైరును పరిశీలించి రక్షణ చర్యలపై రైతులకు సూచనలు చేశారు. చేన్లలో నిలిచిన నీటిని తొలగించడమే కాక పడిపోయిన పంటను జడలు కట్టడం ద్వారా నష్టం తగ్గుతుందని తెలిపారు. ఏడీఏ కె.వెంకటేశ్వరరావు, ఏఓ తారాదేవి, ఏఈఓ వేదిత, సీఈఓ నాగయ్య పాల్గొన్నారు.
ఆలయ పునఃనిర్మాణానికి రూ.40లక్షలు


