కుటుంబ సమస్యలతో ఆత్మహత్య
కారేపల్లి: కారేపల్లి మండలం పేరుపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఖమ్మంలో పురుగుల మందు తాగగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. పేరుపల్లికి చెందిన గణపారపు కోటేశ్వరరావు(45) కుటుంబ సమస్యలతో మనస్థాపం చెందాడు. ఈమేరకు బుధవారం ఖమ్మం వెళ్లిన ఆయన అక్కడే పురుగుల మందు తాగాక కుటుంబీకులకు ఫోన్ చేశాడు. దీంతో వారు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా గురువారం మృతి చెందాడు. కోటేశ్వరరావుకు భార్య రమాదేవి, ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు.
గుండెపోటుతో బీటెక్ విద్యార్థి మృతి
కల్లూరురూరల్: మండలంలోని చెన్నూరుకు చెందిన బీటెక్ విద్యార్థి గుండెపోటుతో గురువారం మృతి చెందాడు. గ్రామానికి చెందిన కొడవటి వెంకటేశ్వరరావు కుమారుడు శేషసాయి ప్రేమ్‌కుమార్(22) హైదరాబాద్‌లో బీటెక్ చదువుతున్నాడు. ఆయన నివాసంలో గురువారం ఉదయం గుండెపోటు రాగా అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో సాయంత్రం మృతదేహాన్ని చెన్నూరుకు తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించగా తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి, కల్లూరు మార్కెట్ చైర్మన్ భాగం నీరజదేవి, కాంగ్రెస్ నాయకులు పసుమర్తి చందర్‌రావు, ఏనుగు సత్యంబాబు, తక్కలపల్లి దుర్గాప్రసాద్, భాగం ప్రభాకర్ తదితరులు ప్రేమ్ మృతదేహం వద్ద నివాళులర్పించి కుటుంబీకులను పరామర్శించారు.
చేపల వేటకు వెళ్లిన వ్యక్తి గల్లంతు
కామేపల్లి: మండలంలోని పాతలింగాల పెద్ద చెరువు కాల్వ క్రింద చేపలు పట్టేందుకు గురువారం వెళ్లిన గోవింద్రాల వాసి బానోత్ శ్రీను గల్లంతయ్యాడు. చేపలు పట్టే క్రమాన కాలు జారి వరద నీటిలో పడడంతో ఆయన గల్లంతయ్యాడని తెలిసింది. దీంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు గాలింపు చేపట్టినా ఆచూకీ లభ్యం కాలేదు. కాగా, శ్రీనుకు ఈత కూడా రాదని కుటుంబీకులు తెలిపారు.
గంజాయి పీలుస్తూ పట్టుబడిన ఇద్దరు
సత్తుపల్లిటౌన్: గంజాయి పీల్చడంతో పాటు ఇంకొందరికి అమ్ముతున్న బాలుడు సహా ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సత్తుపల్లి మండలం కిష్టారానికి చెందిన కువ్వారపు సతీష్‌కుమార్, మైనర్ బాలుడు గంజాయి వాడకానికి అలవాటు పడ్డారు. వీరిద్దరు ఒడిశా – ఏపీ సరిహద్దు అవులపాకకు చెందిన భగవాన్ వద్ద ఈనెల 25న అర కిలో గంజాయి కొనుగోలు చేశారు. సతీష్, బాలుడు కలిసి గురువారం సత్తుపల్లి మెట్టాంజనేయస్వామి గుడి సమీపాన గంజాయిని పీల్చి 100 గ్రాముల గంజాయిని విక్రయించేందుకు ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. అదే సమయాన పోలీసులు తనిఖీ చేస్తుండగా పట్టుబడ్డారు. వీరిద్దరితో పాటు గంజాయి అమ్మిన భగవాన్‌పైనా కేసు నమోదు చేసినట్లు సత్తుపల్లి సీఐ శ్రీహరి తెలిపారు.
గంజాయి లిక్విడ్ స్వాధీనం
రఘునాథపాలెం: గంజాయి లిక్విడ్ విక్రయిస్తున్న ముగ్గురిని గురువారం అరెస్ట్ చేసినట్లు రఘునాథపాలెం సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్ సమీపాన కొందరు గంజాయి సేవిస్తున్నారనే సమాచారంతో ఎస్‌ఐ నరేష్ ఆధ్వర్యాన తనిఖీలు చేపట్టగా రఘునాథపాలెంకు చెందిన నెమ్మది అజయ్, పాండురంగపురానికి చెందిన షేక్ ఇస్మాయిల్, సాకేత్ ముగ్గురు 70 గ్రాముల గంజాయి ఆయిల్‌తో పట్టుబడ్డారు. వీరికి ఖమ్మం వైఎస్‌ఆర్ కాలనీకి చెందిన రాములు ఆయిల్ అందించగా, ఆయనకు రాజమండ్రి వాసి జానీ సరఫరా చేసినట్లు తేలింది. దీంతో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లుసీఐ తెలిపారు.
కుటుంబ సమస్యలతో ఆత్మహత్య
కుటుంబ సమస్యలతో ఆత్మహత్య


