ఎకరాకు రూ.50 వేల పరిహారం చెల్లించాలి
● తుపానుతో వేల ఎకరాల్లో పంట నష్టం ● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
ఖమ్మంమయూరిసెంటర్/రఘునాథపాలెం/కారేపల్లి: మోంథా తుపాను కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వేల ఎకరాల్లో నష్టం వాటిల్లిందని, పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.50వేల చొప్పున పరిహారం అందించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలోని కారేపల్లి, రఘునాథపాలెం మండలాల్లో వర్షానికి దెబ్బతిన్న పంటలను గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ తుపాన్‌తో ఎకరాకు రూ.40వేల నుంచి రూ.50వేల వరకు పెట్టుబడి పెట్టిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. ఈ నేపథ్యాన పత్తిలో 20శాతం తేమ ఉన్నా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కాగా, బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కేంద్రంలోని బీజేపీ వ్యవహరిస్తోందని జాన్‌వెస్లీ ఆరోపించారు. ఈ నేపథ్యాన రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల అంశంపై కేంద్రం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని కోరారు. అలాగే, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.12వేల కోట్లు చెల్లించడమే కాక గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లు కాకుండా కొత్త నోటిఫికేషన్లతో ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఇక బనకచర్ల విషయంలో కేంద్రం రెండు రాష్ట్రాలను కూర్చోపెట్టి మాట్లాడించాల్సింది పోయి.. బనకచర్లకు సహకరించాలంటూ కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమాల్లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.సుదర్శన్, ఎండీ.అబ్బాస్, నున్నా నాగేశ్వరరావు, శ్రీరాంనాయక్, సైదాబాబు, వై.విక్రమ్, మాదినేని రమేష్, వై.శ్రీనివాసరావు, బొంతు రాంబాబు, పిట్టల రవి, నవీన్‌రెడ్డి, స్కైలాబ్‌బాబు, మెరుగు రమణ, కొండెబోయిన నాగేశ్వరరావు, కె.నరేంద్ర, రాయమల్లు, రావూరి వెంకటేశ్వర్లు, బాబు, షేక్ మీరా సాహెబ్, కుటుంబరావు, వర్మ, నాగరాజు, ఇమామ్, నరేష్, రహీం పాల్గొన్నారు.


