పెద్ద చెరువుకు ముప్పు
● కట్ట భద్రతపై రైతుల్లో ఆందోళన ● పరిశీలించిన అదనపు కలెక్టర్, అధికారులు
కామేపల్లి: తుపాన్ ప్రభావంతో కురిసిన వర్షానికి చెరువులు, కుంటలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఇందులో భాగంగానే కామేపల్లి పెద్ద చెరువుకు భారీగా వరద చేరడం.. ఆపై పాతలింగాల పెద్ద చెరువుకు చేరడంతో జలకళ సంతరించుకుంది. అయితే, చెరువు కట్టకు బుధవారం బుంగ(గండి) పడి నీరు బయటకు వస్తుండడంతో మరమ్మతులు చేపట్టారు. అయినా రాత్రి వరద ఎక్కువ కావడంతో కట్టకు పగులు ఏర్పడంది. దీంతో అప్రమత్తమైన అధికారులు మట్టి పోసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈమేరకు రాష్ట్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ కమిషన్ డైరెక్టర్ రాంరెడ్డి గోపాల్‌రెడ్డి, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఇరిగేషన్ ఎస్‌ఈ శ్రీనివాసరావు, ఆర్‌డీఓ నర్సింహారావు గురువారం చేరుకుని పర్యవేక్షించారు. కట్టకు ప్రమాదం జరగకుండా అలుగును తొలగించే ప్రయత్నం చేయించినా సాధ్యం కాలేరు. అలుగును తొలగిస్తేనే కట్ట రక్షణ సాధ్యమవుతుందని భావించి ఆ ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాగా, చెరువు కట్ట తెగితే ఆ చెరువుతో పాటు దిగువన ఉన్న కొండాయిగూడెం పెద్దచెరువుకు కూడా ప్రమాదం పొంచి ఉందని రైతులు తెలిపారు. అంతేకాక వేల ఎకరాల్లో పంట కొట్టుకుపోతుందని వాపోయారు. ఎట్టకేలకు అలుగు తొలగించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తహసీల్దార్ సుధాకర్, ఎంపీడీఓ రవీందర్, ఎస్సై శ్రీకాంత్, ఇరిగేషన్ డీఈఈ శంకర్, ఇతర శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.
పెద్ద చెరువుకు ముప్పు


