తుపాన్ తాకిడికి కూలిన విద్యుత్ స్తంభాలు
ఖమ్మంవ్యవసాయం: మోంథా తుపాన్ కారణంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఇంకొన్ని చోట్ల ఒరిగిపోయాయి. జిల్లాలో 26 స్తంభాలు దెబ్బతినగా, 15 స్తంభాలను తిరిగి ఏర్పాటుచేశారు. కాగా, తుపాను కారణంగా ఖమ్మం విద్యుత్ సర్కిల్‌కు సుమారు రూ. 2 లక్షల మేర నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. ఇక మున్నేటి వరదతో పరీవాహక ప్రాంతాల్లోకి నీరు చేరగా ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యుత్ సరఫరా నిలిపి వేశారు. ఖమ్మంలోని కాల్వొడ్డు, బొక్కలగడ్డ, స్మశాన వాటిక, మోతీనగర్, వెంకటేశ్వరనగర్, ఎఫ్‌సీఐ గోదాంల ప్రాంతాల్లో గురువారం విద్యుత్ సరఫరాను నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు.
పీఆర్‌సీ నివేదిక
వెంటనే ప్రకటించాలి
● టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి
కారేపల్లి: ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించి పీఆర్‌సీ నివేదికను ప్రభుత్వం ప్రకటించి అమలు చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి డిమాండ్ చేశారు. కారేపల్లి మండలంలో వివిధ పాఠశాలలను గురువారం సందర్శించిన ఆయన మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలు ఇవ్వడమే కాక రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలన్నారు. అంతేకాక డీఈఓ, డిప్యూటీ డీఈఓ, ఎంఈఓ పోస్టులను భర్తీ చేయాలని సూచించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కేవీ.కృష్ణారావు, బానోతు మంగీలాల్, ఏటుకూరు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


