ఇంకా బయటపడని డీసీఎం వ్యాన్
కొణిజర్ల: కొణిజర్ల మండలం అంజనాపురం వద్ద నిమ్మవాగు వరదలో బుధవారం గల్లంతైన డీసీఎం డ్రైవర్ ఆరేపల్లి మురళీకృష్ణ ఆచూకీ గురువారం సాయంత్రం వరకు కూడా లభించలేదు. ఎస్‌ఐ జి.సూరజ్ నేతృత్వాన ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం గురువారం ఉదయం నుంచే గాలించినా వరద కారణంగా డీసీఎంను గుర్తించలేకపోయారు. చివరకు ఎన్‌డీఆర్‌ఎఫ్ సభ్యులు అయస్కాంతాల సాయంతో గాలించగా కొట్టుకుపోయిన స్థలం నుంచి 200 మీటర్ల దూరాన డీసీఎం ఇసుకలో కూరుకుపోయినట్లు తేలింది. ఆపై రెండు భారీ క్రేన్లు తెప్పించి డీసీఎంను లాగేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మూడో సారి డీసీఎం ట్రక్కుకు చైన్‌ను తగిలించగా వెనక భాగం ముక్కలు ఊడి వచ్చాయి. అయితే, డీసీఎంలో డ్రైవర్ ఆచూకీ మాత్రం తెలియరాలేదు. తిరిగి శుక్రవారం గాలింపు చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. వైరా సీఐ వెంకటప్రసాద్, తహసీల్దార్ నారపోగు అరుణ, ఎంపీడీఓ గుగులోత్ వర్ష, ఎంపీఓ ఆర్.ఉపేంద్రయ్య, ఆర్‌ఐలు నరేష్, రమేష్ పర్యవేక్షించారు.


