నైపుణ్యాల పెంపునకే ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’
ఖమ్మం సహకారనగర్: బట్టీ చదువులకు స్వస్తి పలికి విద్యార్థుల్లో చదివే సామర్థ్యాలు పెంచేలా ఉపాధ్యాయులు బోధన పద్ధతి అవలంబించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. ఖమ్మం ఎన్నెస్సీ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో ప్రతిరోజు నిర్వహిస్తున్న ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం అమలును గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పదాలను బోర్డుపై రాసి విద్యార్థులతో చదివించి ఉచ్ఛారణపై సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ విద్యార్థికి చదివే సామర్థ్యం పెంచాలనేలక్ష్యంతో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని పక్కాగా అమలుచేయాలని సూచించారు. నెల పాటు ప్రతీ విద్యార్థితో గంట సేపు చదివించేలా ప్రత్యేక బుక్‌లెట్ ఉపయోగిస్తూ వారి సామర్థ్యాలను యాప్‌లో నమోదు చేయాలని తెలిపారు. సీఎంఓ ప్రవీణ్, ఎంఈఓ శైలజాలక్ష్మి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


