సీజేఐపై దాడి దుర్మార్గపు చర్య
ఖమ్మంమామిళ్లగూడెం: విశ్వాసాల ముసుగులో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్‌పై దాడి చేయడం దుర్మార్గపు చర్య అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని గౌరవించని వారు, చట్టాలకు విలువ ఇవ్వని వారు దేశద్రోహులుగా మిగిలిపోతారని తెలిపారు. దళితులపై ఇప్పటికీ వివక్ష, అంటరానితనం, దాడులు, హత్యలు, లైంగికదాడులు కొనసాగుతూనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశా రు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌పై దాడి జరిగి మూడు వారాలు గడుస్తున్నా, ఢిల్లీ పోలీసులు కేసు పెట్టలేద ని, న్యాయ వ్యవస్థ సుమోటోగా తీసుకోకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. మానవ హక్కుల కమిషన్ కూడా స్పందించలేదంటే దేశంలో దళితులకు రక్షణలేదని రుజువవుతోందని చెప్పారు. జస్టిస్ గవాయ్‌పై దాడి చేసిన వారు స్వేచ్ఛగా తిరుగుతున్నారని, ‘విశ్వాసాల పరంగా దాడి చేశాం, అందుకు కట్టుబడి ఉన్నాం’అని చెబుతుండడం గర్హనీయమన్నారు. ఎవరి మతాలను వారు గౌరవించినా.. రాజ్యాంగాన్ని అందరూ గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. రాజ్యాంగ పరిరక్షణకు నవంబర్ 1న హైదరాబాద్‌లో నిర్వహించే భారీ ర్యాలీని జయప్రదం చేయాలని మంద కృష్ణ కోరారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ నాయకులు కందికట్ల విజయ్, తూరుగంటి అంజయ్య, కూరపాటి సునీల్ పాల్గొన్నారు.
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు
మంద కృష్ణ


