పకడ్బందీగా మెడికల్ వ్యర్థాల తరలింపు
ఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలోని ఆస్పత్రుల నుంచి బయో మెడికల్ వ్యర్థాల తరలింపు పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. కలెక్టరేట్‌లో బుధవారం జరిగిన జిల్లాస్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణ, సురక్షితంగా తరలించడం ద్వారా ప్రజల ఆరోగ్యంతో పాటు పర్యావరణాన్ని రక్షించొచ్చని తెలిపారు. జిల్లాలో 37 ప్రభుత్వ, 592 ప్రైవేట్ ఆస్పత్రు లు, ఒక వెటర్నరీ ఆస్పత్రి పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి నుంచి లైసెన్స్ పొందాయని చెప్పారు. బయో మెడికల్ వ్యర్థాల సేకరణ కోసం వాహనాలు అందుబాటులో ఉండగా కేటగిరీల వారీగా వ్యర్థాలను ఆస్పత్రుల్లో వేరుచేసేలా సూచనలు చేయాలని అధి కారులను ఆదేశించారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ కళావతిబాయి, ప్రభుత్వ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ ఎం.నరేందర్, ఐఎంఏ కార్యదర్శి ఎం.కోటేశ్వరరావు, డీసీహెచ్‌ఎస్ రాజశేఖర్‌గౌడ్, అధికారులు చందునాయక్, వెంకటరమణ, పి.రామారావు, రవీందర్, షారూఖ్ గజ్దర్, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ధంసలాపురం వాసికి డాక్టరేట్
ఖమ్మంఅర్బన్: ఖమ్మం ధంసలాపురం కొత్తకాలనీవాసి వంగూరి చిరంజీవికి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో డాక్టరేట్ లభించింది. ఆయన విక్రమ్‌సింగ్ రాథోర్ పర్యవేక్షణలో పరిశోధనాపత్రం సమర్పించారు. దీంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జే.ఎస్. విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రకటించింది. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో అధ్యాపకుడిగా విధులు నిర్వర్తిస్తున్న చిరంజీవిని కార్పొరేటర్లు మేడారపు వెంకటేశ్వర్లు, ఆళ్ల నిరీషాఅంజిరెడ్డి తదితరులు అభినందించారు.
2న అండర్–19
నెట్‌బాల్ ఎంపికలు
ఖమ్మంస్పోర్ట్స్: ఉమ్మడి జిల్లాస్థాయి అండర్–19 బాలబాలికల నెట్‌బాల్ జట్లను వచ్చేనెల 2న ఎంపిక చేయనున్నారు. ఈ ఎంపిక పోటీలు ఖమ్మంలోని సెయింట్ జోసెఫ్ హై స్కూల్‌లో జరుగుతాయని జూనియర్ కళాశాల క్రీడా సంఘం కార్యదర్శి ఎండీ మూసాకలీం తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు వయస్సు ధ్రువపత్రాలతో ఉదయం 10 గంటలకు హాజరుకావాలని, వివరాలకు 98483 41238 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
వరద ఉధృతిని
పరిశీలించిన డీపీఓ
తల్లాడ: మండలంలోని మాచవరం వాగు ఉధృతితో బుధవారం రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోగా జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) ఆశాలత పరిశీలించారు. మాచవరం వాగు లోలెవల్ బ్రిడ్జి పైనుంచి వరద ప్రవహిస్తుండగా బిల్లుపాడు, రామచంద్రాపురం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అంతేకాక రామచంద్రాపురం వాసులకు తల్లాడతో సంబంధాలు తెగిపోయాయి. ఈనేపథ్యాన గ్రామంలో పరిస్థితులపై ఆరా తీసిన డీపీఓ భద్రతపై గ్రామ కార్యదర్శులకు సూచనలు చేశారు. ఎంపీడీఓ సురేశ్‌బాబు, గ్రామ కార్యదర్శి సాయికుమార్, మాజీ ఎంపీటీసీ రుద్రాక్ష బ్రహ్మం పాల్గొన్నారు.
వన్యప్రాణుల ఉత్పత్తుల వ్యాపారంపై విచారణ
ఖమ్మంవ్యవసాయం: వణ్యప్రాణుల ఉత్పత్తుల అక్రమ వ్యాపారంపై అటవీ శాఖ అధికారులు లోతుగా విచారణ చేపడుతున్నారు. ప్రజల విశ్వాసం, నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని నిషేధిత అటవీ ఉత్పత్తులు, సముద్ర ఉత్పత్తులను కొందరు విక్రయిస్తూ రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అటవీ ప్రాంతాల నుంచి హతజోడి తదితర మొక్కలతో పాటు పులి గోర్లు, ఇతర జంతువుల శరీర భాగాలు, నల్లమల, శ్రీశైలం, ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతాల నుంచి జంతువుల ఉత్పత్తులను సేకరించి డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. అంతేగాక నేపాల్, హిమాచల్‌ప్రదేశ్, కశ్మీర్ రుద్రాక్షల పేరిట అమ్ముతున్నారు. వీటితో పాటు సముద్రాల్లో లభమయ్యే ఆల్చిప్పలు, ముత్యాలు, పగడాలను జిల్లాలోని కొందరు జ్యూయలరీ షాపుల వ్యాపారులు మధ్యవర్తుల ద్వారా తెప్పించి అమ్ముతున్నట్లు బయటపడింది. ఈ మేరకు చైన్నెలోని వైల్డ్‌లైఫ్ క్రైం కంట్రోల్ బ్యూరో(డబ్ల్యూసీసీబీ) అధికారులు, జిల్లా అటవీ టాస్క్‌ఫోర్స్ బృందంతో కలిసి మంగళవారం తనిఖీలు చేపట్టి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి నిషేధిత అటవీ, జంతు ఉత్పత్తులను స్వాధీనం చేసుకోగా విచారణ ముమ్మరం చేశారు. అయితే, వీరికి ఉత్పత్తులు అందజేసిన మధ్యవర్తులు రూ.కోట్లలో వ్యాపా రం చేస్తున్నట్లు గుర్తించారని సమాచారం. ఈ మేరకు ఒకటి, రెండు రోజుల్లో కీలక వ్యక్తులను గుర్తించే అవకాశముందని తెలిసింది. కాగా, వ్యాపారులు పట్టుబడినట్లు తెలియడంతో మధ్యవర్తులు సెల్‌ఫోన్లు స్విచాఫ్ చేయగా, ఎవరికీ అందుబాటులో లేరని సమాచారం.
పకడ్బందీగా మెడికల్ వ్యర్థాల తరలింపు


