తుపాన్
వాగులు ఉప్పొంగడంతో స్తంభించిన రాకపోకలు ఖమ్మం జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రాంతాలు జలమయం పత్తి, వరి పంటలకు తీరని నష్టం
పంజా విసిరిన
మోంథా తుపాను జిల్లాను కుదిపేసింది. మంగళవారం రాత్రి నుంచి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బుధవారం మధ్యాహ్నం వరకు కొనసాగింది. జిల్లాతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షంతో వాగులు, జలాశయాలు పొంగి ప్రవహించగా.. కొన్ని చోట్ల రహదారులపైకి వరద చేరింది. దీంతో ఖమ్మం నగరంతో పాటు జిల్లాలోని పలు గ్రామాలు జలమయమయ్యాయి. అలాగే, చేతికందే దశలో ఉన్న వరి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. – ఖమ్మంవ్యవసాయం
బోనకల్‌లో అత్యధికం
తుపాన్ ప్రభావంతో మంగళవారం రాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా వర్షం ఎడతెరిపి లేకుండా కురిసింది. మంగళవారం ఉదయం 8–30 నుంచి బుధవారం ఉదయం 8–30 గంటల వరకు జిల్లా సగటు వర్షపాతం 57 మి.మీ.గా నమోదైంది. బోనకల్‌లో అత్యధికంగా 93.4 మి.మీ.ల వర్షపాతం నమోదు కాగా తల్లాడ, వైరా, పెనుబల్లి, మధిర, కల్లూరు, ఎర్రుపాలెం, ఖమ్మంరూరల్, రఘునాథపాలెం, కామేపల్లి, చింతకాని, కొణిజర్ల మండలాల్లోనూ ప్రభావం కనిపించింది. ఖమ్మంలో 52.2 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. అలాగే, బుధవారం ఉద యం 8–30 నుంచి సాయంత్రం వరకు అత్యధికంగా తిరుమలాయపాలెంలో 94.3 మి.మీ.ల వర్షపాతం నమోదు కాగా, లింగాల, బచ్చోడు, గేటు కారేపల్లి, కాకరవాయి, మంచుకొండ, పల్లెగూడెం, రఘునాథపాలెం, ఖమ్మం , కూసుమంచి, తిమ్మారావుపేట, తల్లాడ, నేలకొండపల్లిలో వర్షం కురిసింది.
రహదారులను కమ్మేసిన వరద
భారీ వర్షాలతో వాగులు నిండి వరద రహదారులు, లో లెవల్ చప్టాలపైకి చేరింది. దీంతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కొణిజర్ల మండలం లాలాపురం తీగలబంజర వద్ద పగిడేరు వాగు ఉప్పొంగగా, చింతకాని మండలం బండిరేవు వాగు ప్రవాహంతో నాగులవంచ–పాతర్లపాడు, అష్ణగుర్తి–పొద్దుటూరు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఖమ్మం రూరల్ మండలంలో ఆకేరు ఉధృతితో గొల్లగూడెం–మంగళగూడెం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కారేపల్లి మండలంలోని కస్తూర్బా స్కూల్‌లోకి మద్దుల వాగు నీరు చేరగా అధికారులు అప్రమత్తమయ్యారు. అంతేకాక బోనకల్, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, ముదిగొండ మండలాల్లో కూడా వాగుల ఉధృతి కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. కోదాడ–ఖమ్మం రహదారిపై పెద్ద వృక్షం నేలకూలి రాకపోకలకు అంతరాయం కలిగింది. కల్లూరు మండలం చంద్రుపట్లలో ఓ పెంకుటిల్లు కూలింది.
జలమయం
ఎగతెరిపి లేని వర్షంతో ఖమ్మం నగరంతో పాటు అనేక గ్రామాలు జలమయమయ్యాయి. ఖమ్మం బైపాస్ రోడ్డు హెచ్‌పీ బంక్ ఏరియా, కొత్త బస్టాండ్, కమాన్‌బజార్, కస్బా బజార్, మయూరి సెంటర్, పాత బస్టాండ్, వైరా రోడ్డు, ఇల్లెందు క్రాస్, ఐటీ హబ్ ఏరియా, గాంధీచౌక్, వర్తక సంఘం ఏరియా, పొట్టి శ్రీరాములు రోడ్, హర్కారాబావి ఏరియా, శ్రీనివాసనగర్ తదితర ప్రాంతాల్లో రహదారులపైకి నీరు చేరింది. వర్షపు నీటికి తోడు డ్రెయిన్లు పొంగి రహదారులపైకి చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు.
దెబ్బతిన్న పత్తి, వరి పంటలు
తుపాను కారణంగా జిల్లాలో పత్తి, వరి పంటలకు భారీ నష్టం వాటిల్లింది. జోరుగా పత్తితీతలు సాగుతున్న వేళ కురిసిన వర్షం నేలపాలు చేసింది. 2.51 లక్షల ఎకరాల్లో పత్తికి నష్టం వాటిల్లినట్లు అంచనా. అలాగే, 2.98 లక్షల ఎకరాల్లో సాగైన వరి కంకి దశ నుంచి కోత దశలో ఉంది. ఈదురుగాలులకు తోడు వర్షంతో కోత దశలో వరి పైర్లు నేలవాలడమే కాక వరి కంకి మునగడంతో పంట దెబ్బతింటోంది.
‘మోంథా’ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం
తుపాన్


