చిరు జీవితాలకు చేయూత
వీధివ్యాపారులకు రుణలక్ష్యాలు ఇలా..
● వీధి వ్యాపారులకు రుణలక్ష్యాలు ఖరారు ● జిల్లాలో 2,977 మందికి అవకాశం ● పాత వారికీ ఇచ్చేలా కార్యాచరణ
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర ప్రభుత్వం వీఽధి వ్యాపారులకు చేయూతనిచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసింది. వీరికి రుణ సదుపాయం కల్పిస్తూ వ్యాపారాభివృద్ధిలో సహకారం అందించనుంది. నూతనంగా వ్యాపారం చేయాలనుకునే వారితో పాటు గతంలో రుణం తీసుకుని తిరిగి చెల్లించిన వారికి మరో సారి రుణాలు పంపిణీ చేయనున్నారు. జిల్లాలో కొత్తగా 2,977 మందికి రుణాలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది.
అండగా నిలిచేందుకు..
కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో అనేకమంది తోపుడు బండ్లు, బడ్డీ కొట్లు, సైకిళ్లపై వీధుల వెంట వ్యాపా రం చేస్తూ కుటుంబాలను పోషిస్తున్నారు. కొందరు చిరువ్యాపారులకు ఆర్థిక ఇబ్బందులతో వ్యాపారం నిర్వహణ కష్టంగా మారగా.. ఇంకొందరు ప్రైవేట్ వ్యాపారుల వద్ద అధిక వడ్డీతో రుణాలు తీసుకుంటున్నారు. తద్వారా వచ్చే ఆదాయం వడ్డీలకే పోతోంది. ఈనేపథ్యాన వీధివ్యాపారులు నష్టపోకుండా ప్రభుత్వం రుణ సదుపాయం కల్పిస్తోంది. ఇప్పటివరకు రుణాలు తీసుకుని సక్రమంగా చెల్లించిన వారికే కాక కొత్తవారికీ రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు ఐదు మున్సిపాలిటీల్లో కొత్త వ్యాపారులను గుర్తించి రుణాలు ఇచ్చేలా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. వీరికి మెప్మా ఆధ్వర్యాన గుర్తింపు కార్డులు కూడా జారీ చేస్తారు. 2025–26 ఏడాదికి జిల్లాలో 2,977 మందికి కొత్తగా రుణాలు ఇవ్వనుండగా, కేఎంసీ పరిధిలో అత్యధికంగా 1,912 మందికి రుణాలు అందజేస్తారు.
రూ.15 వేల నుంచి..
వీధి వ్యాపారులకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు రుణసదుపాయం కల్పిస్తారు. తొలుత వ్యాపారులు మెప్మా అధికారుల ను కలిసి తమ వివరాలు తెలియజేయాలి. అలాగే ఆధార్, బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ ఖాతాకు లింక్ అయిన ఫోన్ నంబర్, వ్యాపారానికి సంబంధించిన ఫొటోలు సమర్పించాలి. చేసే వ్యా పారం, వచ్చే ఆదాయం, అప్పు తీర్చడానికి ఉన్న మార్గాలను వివరిస్తే మెప్మా అధికారులు ఆన్‌లైన్‌లో నమోదు చేసి బ్యాంక్ ద్వారా రుణం ఇప్పిస్తారు.
మరోసారి కూడా..
కొత్తవారికి రుణాలు ఇవ్వడమే కాక గతంలో రుణాలు తీసుకుని సక్రమంగా చెల్లించిన వారికి మరో దఫా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా ఖమ్మం కార్పొరేషన్‌తోపాటు ఏదులాపురం, మధిర, కల్లూరు, సత్తుపల్లి, వైరా ప్రాంతాల్లోని వ్యాపారులను గుర్తించారు. ఒకసారి రుణం తీసుకుని చెల్లించిన వారిలో 1,337 మందికి, రెండుసార్లు రుణం తీసుకుని చెల్లించిన వారిలో 368 మందికి ఇంకో దఫా రుణాలు ఇవ్వనున్నారు.
మున్సిపాలిటీ కొత్త రుణాలు రెండోసారి మూడోసారి
పొందేవారు
ఖమ్మం కార్పొరేషన్ 1,912 862 208
ఏదులాపురం 469 235 63
మధిర 155 80 30
కల్లూరు 182 91 27
సత్తుపల్లి 122 35 20
వైరా 137 34 20
మొత్తం 2,977 1,337 368


