బైపాస్ రోడ్డులో బారులు
● నిత్యం ట్రాఫిక్ సమస్యతో జనం ఇక్కట్లు ● నెలల తరబడి ఇదే పరిస్థితి
ఖమ్మంరూరల్: జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డు మీదుగా ప్రయాణమంటేనే వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. సమయం, సందర్భం లేకుండా నిత్యం ఈ మార్గంలో ట్రాఫిక్ జామ్ అవుతుండడంతో గమ్యానికి ఎప్పుడు చేరుకుంటారో తెలియని పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఖమ్మం కాల్వొడ్డులోని పాత బ్రిడ్జి వద్ద తీగల వంతెన నిర్మాణంతో ద్విచక్ర వాహనాలనే అనుమతిస్తున్నారు. దీంతో మిగిలిన వాహనాలన్నీ కరుణగిరి బ్రిడ్జి పైనుంచే బైపాస్ రహదారిపైకి వచ్చివెళ్లాల్సి వస్తోంది.
అన్ని వాహనాలు ఇటే...
హెదరాబాద్, ఇతర జిల్లాల నుండి ఖమ్మం జిల్లా కేంద్రానికి వచ్చే వాహనాలే కాక ఏపీ, ఛత్తీస్‌గఢ్ వెళ్లాల్సిన వాహనాలు సైతం ఇదే మార్గంలో వెళ్లాలి. అంతేకాక ఖమ్మం నగరానికి వివిధ పనుల నిమిత్తం గ్రామాల నుండి వచ్చే ఆటోలు, కార్లు, ఇతర వాహనాలకు కూడా ఇదే ప్రధాన రహదారిగా కావడంతో కరుణగిరి వద్ద మున్నేటిపై బ్రిడ్జి, బైపాస్ రోడ్డులో నిత్యం గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతోంది. అటు నాయుడుపేట సెంటర్ వరకు, ఇటు ఖమ్మంలోని కొత్త బస్టాండ్ వరకు ట్రాఫిక్ నిలిచిపోతుండగా.. పోలీసులు శ్రమించినా ఫలితం కానరావడం లేదు. ప్రత్యామ్నాయ మార్గాలు సైతం లేక ఎటూ వెళ్లలేని పరిస్థితుల్లో వాహనదారులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఈ సమస్య దాదాపు ఏడు నెలలుగా కొనసాగుతుండడంతో బైపాస్ రోడ్డు మీదుగా ప్రయాణమంటేనే ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. తరచుగా ట్రాఫిక్ జామ్ అవుతుండడంతో అంబులెన్స్‌లు సైతం నిలిచిపోతుండడం గమనార్హం. పాత బ్రిడ్జి వద్ద మున్నేటి మీదుగా ఆటోలు, చిన్న వాహనాలు వచ్చివెళ్లేలా రహదారి చేపడితే సమస్యకు తాత్కాలిక పరిష్కారం లభిస్తుంది. ఈమేరకు అధికారులు దృష్టి సారించాలని వాహనదారులు, నగరవాసులు కోరుతున్నారు.


