ఎందుకోసం ఈ సమావేశం?
అధికారుల గైర్హాజరుపై
ఎంపీ రఘురాంరెడ్డి అసహనం
పది నిమిషాల్లోనే ‘దిశ’ కమిటీ
సమావేశం వాయిదా
ఖమ్మంమయూరిసెంటర్: కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై చర్చించేందుకు జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ(దిశ) కమిటీ సమావేశాన్ని మంగళవారం కలెక్టరేట్‌లో ఏర్పాటుచేయగా, నిర్వహణ లోపాలపై ఖమ్మం ఎంపీ, కమిటీ చైర్మన్ రామసహాయం రఘురాంరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు అందుబాటులో లేని సమయాన ఏర్పాటుచేయడమే కాక పలువురు ఉన్నతాధికారులు గైర్హాజరు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 2–10 గంటలకు కలెక్టరేట్‌కు ఎంపీ రాగా ఉన్నతాధికారులు లేకపోవడంతో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి చాంబర్‌కు వెళ్లి అయనతో కలిసి 2–20 గంటలకు హాల్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు లేకపోవడంతో సమావేశం నిర్వహణ ఎలా సాధ్యమని వాఖ్యానించారు. ఏదైనా సమస్య ఉంటే రీ షెడ్యూల్ చేసుకోవచ్చని, కానీ సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పి రాకపోవడం సరికాదని తెలిపారు. ‘మంత్రుల కార్యక్రమాలు ఉన్నాయని రెండు రోజుల ముందే తెలుసు.. ఆ కార్యక్రమాలకు వెళ్లొద్దని చెప్పడం లేదు.. కానీ అధికారులు వారి సలహా తీసుకుని సమన్వయంతో సమావేశాలు నిర్వహించాలి’ అని సూచించారు. దిశ కమిటీ సమావేశంతో మెరుగైన ఫలితాలు రావాలంటే ఎమ్మెల్యేలు, అధికారుల హాజరు తప్పనిసరని ఎంపీ తెలిపారు.
అజెండా ప్రారంభించగానే..
దిశ కమిటీ సమావేశంలో తొలుత డీఆర్‌డీఓ సన్యాసయ్య గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, వాటిపై తీసుకున్న చర్యల వివరాలను తెలపాలంటూ పరిశ్రమలు, పౌర సరఫరాల శాఖ అధికారులకు సూచించారు. ఆయా శాఖల అధికారులు నిర్ణయాలను వెల్లడించాక విద్యాశాఖ నివేదిక ఇవ్వాల్సిందిగా ఎంపీ సూచించగా ఆ శాఖ నుంచి ఎవరూ లేరు. ఆ తర్వాత వరుసగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, వైరా మున్సిపాలిటీ అధికారులను పిలిచినా వారూ రాలేదు. దీంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఎంపీ రఘురాంరెడ్డి సమావేశానికి వచ్చేందుకు ఆయా శాఖల్లో ఒక్క అధికారి కూడా లేరా అని ప్రశ్నించారు. ‘నాది ఒక సజెషన్.. ఇక్కడకు వచ్చిన అధికారులు ఇన్‌కన్వినెన్స్‌గా భావించకండి.. పూర్తిస్థాయిలో ఉన్నతాధికారులు ఉన్నప్పుడే సమావేశాన్ని నిర్వహించుకుందాం.. అప్పటివరకు తాత్కాలికంగా వాయిదా వేయండి’ అని సూచిస్తూ ఎంపీ వెళ్లిపోయారు.
ఎంపీ వెళ్లిన తర్వాత..
సమావేశం 2–20 గంటలకు ప్రారంభం కాగా.. అధికారులు లేకపోవడంతో వాయిదా వేస్తూ పది నిమిషాల్లో ముగించారు. ఆపై ఎంపీ వెళ్లిపోయాక వైరా మున్సిపల్ కమిషనర్, ఇతర శాఖల అధికారులు చేరుకున్నారు. వైరా కమిషనర్ రిజిస్టర్‌లో సంతకం చేసేందుకు ప్రయత్నించగా ఎంపీ పిలిచిన సమయంలో లేకుండా ఇప్పుడు సంతకం చేయొద్దని అధికారులు చెప్పడంతో ఆయన వెనక్కి తగ్గారు. ఇతర అధికారులు కూడా సమావేశం వాయిదా పడిందని తెలిసి వెనుదిరిగారు.
ఎందుకోసం ఈ సమావేశం?


