నిండుకుండలా పాలేరు!
● ముంపు ఎదురుకాకుండా వరద మళ్లింపు ● కాల్వల భద్రత దృష్ట్యా ఆయకట్టుకు నీటి విడుదల నిలిపివేత
కూసుమంచి: మండలంలోని పాలేరు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టమైన 23 అడుగులకు గాను మంగళవారం 22 అడుగులకు చేరడంతో జలకళ సంతరించుకుంది. ఈనేపథ్యాన మోంథా తుపాన్ ప్రభావంతో భారీ వర్ష సూచన ఉండగా రిజర్వాయర్, కాల్వకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా అధికారులు అప్రమత్తమయ్యారు. గతేడాది సెప్టెంబర్ 1న భారీ వర్షాలతో రిజర్వాయర్ ఉప్పొంగి కాల్వలకు భారీ గండ్లు పడ్డాయి. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం పంటలకు నీటి అవసరం తగ్గడంతో రిజర్వాయర్ నుంచి ఎడమ కాల్వ, పాలేరు కాల్వకు సరఫరా పూర్తిగా నిలిపివేశారు. ఒకవేళ భారీ వర్షాలు, వరద వచ్చినా ఎలాంటి ప్రమాదం జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాక సాగర్ నుంచి రిజర్వాయర్‌కు నీటి సరఫరా నిలిపివేయాలని ఇక్కడి అధికారులు కోరడంతో మంగళవారం 1,600 క్యూసెక్కులకు తగ్గించగా రెండు రోజుల్లో ప్రవాహం పూర్తిగా నిలిచిపోనుంది.
మిగులు జలాలు ఏటిలోకి...
రిజర్వాయర్ నీటిమట్టం 22 అడుగులకు చేరగా ఎగువ నుంచి 1,100 క్యూసెక్కుల వరదతో పాటు సాగర్ నుంచి 1,600 క్యూసెక్కుల నీరు చేరుతోంది. దీనికి తోడు దిగువకు నీటి విడుదల నిలిపివేయగా రిజర్వాయర్ నీటిమట్టం గరిష్ట స్థాయిని దాటకుండా ఔట్ ఫాల్ గేట్ల(అలుగుల గేట్లు)ను కొంతమేర ఎత్తారు. దీంతో 1,500 క్యూసెక్కుల నీరు గేట్ల ద్వారా పాలేరు ఏటిలో కలుస్తోంది. తద్వారా రిజర్వాయర్ నీటిమట్టాన్ని 20 అడుగులుగా క్రమబద్ధీకరించనునున్నారు. అయితే, తుపాన్ ప్రభావం తగ్గాక ఆయకట్టుకు తిరిగి నీరు విడుదల చేస్తామని అఽధికారులు తెలిపారు.
నిండుకుండలా పాలేరు!


