ఎస్సీ, ఎస్టీ, బీసీల ఐక్యత అవసరం
● వీరిని చీల్చి అందలం ఎక్కుతున్న పార్టీలు ● రథయాత్రలో టీఆర్‌ఎల్‌డీ అధ్యక్షుడు ‘కపిలవాయి’
ఖమ్మంమామిళ్లగూడెం: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల ఐక్యత చారిత్రక అవసరమని తెలంగాణ రాష్ట్ర రాష్ట్రీయ లోక్‌దళ్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ అన్నారు. ఆయా వర్గాలకు ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు డబ్బు, మందు ఎర చూపి ఓట్లను చీల్చి అందలం ఎక్కుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలనే డిమాండ్‌తో టీఆర్‌ఎల్‌డీ ఆధ్వర్యాన చేపట్టిన రథయాత్ర సోమవారం ఖమ్మం చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు నష్టపరిహారం, పంట బీమా, ధాన్యం కొనుగోళ్లు, యూరియా పంపిణీలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అంతేకాక నిరుద్యోగులకు భృతి, ఉద్యోగాలు ఇవ్వకుండా అన్యాయం చేసిందన్నారు. ఉమ్మడి జిల్లాలో సింగరేణి ఓపెన్‌కాస్ట్ పనులను తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. కాగా, తమ పార్టీ ఆధ్వర్యాన త్వరలోనే ఖమ్మం, భద్రాద్రి, వరంగల్ జిల్లాల్లో జాబ్‌మేళాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
ప్రభుత్వం కూలడం ఖాయం
రానున్న మూడు నెలల్లో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోనుందని దిలీప్ కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అలవికాని హామీలతో గద్దెనెక్కగా, మంత్రుల తీరుతో ప్రభుత్వం కూలిపోవడం ఖాయమన్నారు. ఈమేరకు కమీషన్ల కోసమే పనిచేస్తున్నమంత్రులను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడమే కాక 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని, ప్రైవేట్ పరిశ్రమల్లో స్థానికులకు 95 శాతం ఉద్యోగాలు దక్కేలా చట్టం చేయాలని అన్నారు. అంతేకాక విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ విద్యాసంస్థల్లో 25 శాతం పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించాలని, రాజీవ్ యువవికాసం పథకాన్ని అమలు చేయడంతో పాటు కల్యాణలక్ష్మి ద్వారా తులం బంగారం, గృహలక్ష్మి పథకం కింద మహిళలకు రూ.2,500, యువతులకు స్కూటీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీఆర్‌ఎల్‌డీ నాయకులు గౌర బీరప్ప, మోత్కూరి వెంకటాచారి, గంట్యాల నరసింహారావు, నూనె భాస్కరరావు, రిషబ్ జైన్, ఎస్.కే. జానీ మహ్మద్, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రథయాత్రలో వెంకన్న ఆధ్వర్యాన పలువురు కళాకారులు, కార్యకర్తలు ఇచ్చిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.


