గంజాయి నిందితుడిపై పీడీ యాక్ట్
ఇల్లెందు: ఎస్పీ రోహిత్‌రాజ్ ఆదేశాల మేరకు ఇల్లెందు సీఐ టి.సురేశ్ గంజాయి సరఫరా చేసే సపావత్ వెంకన్నపై పీడీ యాక్టు కేసు నమోదు చేశారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కాశీరాంతండాకు చెందిన సపావత్ వెంకన్న గంజాయి సరఫరా కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఖమ్మం జిల్లా జైలులో ఉన్న వెంకన్నపై పీడీ యాక్టు నమోదు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. నిందితుడిపై భద్రాచలం, దుమ్ముగూడెం, రాజేంద్రనగర్, ఇల్లెందు తదితర పోలీస్ స్టేషన్ల లో కేసులు నమోదై ఉన్నాయి. గత ఏడాది ఇల్లెందు పోలీసులు వెంకన్నను అరెస్టు చేసి, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఆ కేసులో వెంకన్నను అరెస్ట్ చేయగా.. చాకచక్యంగా తప్పించుకున్నాడు. పట్టణం దాటక ముందే ఆనాటి సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి ఖమ్మం జైలుకు తరలించారు. తాజాగా వెంకన్నపై పీడీ యాక్టు కేసు నమోదు చేసి, అతడిని చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ సందర్భంగా ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను, సీఐ సురేశ్, పోలీస్ సిబ్బందిని ఎస్పీ రోహిత్‌రాజ్ అభినందించారు.
గంజాయి అడ్డాలపై నిఘా
రఘునాథపాలెం: మండలంలోని రౌడీషీటర్లు, గంజాయి, మాదక ద్రవ్యాల అడ్డాలపై పోలీసులు దృష్టి సారించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రఘునాథపాలెం సీఐ ఉస్మాన్ షరీఫ్ ఆధ్వర్యంలో పోలీసు బృందాలు రెండు రోజులుగా ప్రత్యేక తనిఖీలు చేపట్టాయి. రౌడీషీటర్ల చిరునామాల ప్రకారం వారి నివాసాలను సందర్శించి, వారు ఎక్కడ ఉంటున్నారు? ఎవరితో ఉంటున్నారు? రోజువారీ దినచర్య ఏంటన్న అంశాలపై సమాచారం సేకరించా రు. మండల పరిధిలోని కొన్ని ప్రాంతాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయనే సమాచారం నేపథ్యంలో ఆ ప్రదేశాలను కూడా పోలీసులు పరిశీలించారు. యువకులు తరచుగా రాకపోకలు సాగిస్తున్న హాట్‌స్పాట్‌లపై నిఘా ఏర్పాటు చేసి, వ్యక్తుల వివరాలను నమోదు చేసే ప్రక్రియ కొనసాగిస్తున్నట్టు పోలీసులు చెప్పా రు. రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పటివరకు 17మంది రౌడీషీటర్లు జాబితాలో ఉన్నారని, వారి కదలికలపై నిరంతర నిఘా ఉంచి ఎలాంటి చట్టవ్యతిరేక చర్యలకు తావు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్టు సీఐ ఉస్మాన్ షరీఫ్ వెల్లడించారు.
పిచ్చికుక్క దాడిలో
ఇద్దరికి గాయాలు
కూసుమంచి: మండలంలోని జీళ్లచెరువు గ్రామంలో పిచ్చికుక్క దాడిలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈదాడిలో ఉదయం గ్రామానికి చెందిన ఓ బాలుడు గాయపడ్డాడు. సాయంత్రం గ్రామ పంచాయతీ కార్మికుడు గోపె నాగయ్యపై దాడిచేయగా నుదుటిన తీవ్ర గాయాలయ్యాయి. గ్రామంలోని పశువులు, మేకలను కరిచి గాయపర్చటంతోగ్రామస్తులు కుక్కను వెంబడించి హతమార్చారు.
ఎలుకల మందు తిని
వృద్ధురాలు మృతి
ఖమ్మంఅర్బన్: మతిస్థిమితం కోల్పోయిన వృద్ధురాలు ఎలుకల మందు తిని చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన ఖమ్మంఅర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ భానుప్రకాశ్ కథనం ప్రకారం.. రామన్నపేట కాలనీలో నివసించే షేక్ హిమాంబీ (62) కొంతకాలంగా మతిస్థిమితం కోల్పోయింది. శనివారం ఆమె ఇంట్లోనే ఎలుకల మందు తిన్నది. గమనించిన బంధువులు ఆమెను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి కుమారుడు జానీమియా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు.
చికిత్స పొందుతున్న చిన్నారి మృతి
కారేపల్లి: పేస్ట్ అనుకుని ఎలుకల మందు తిన్న చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. మండలంలోని గోవింద్‌తండాకు చెందిన ధరావత్ మానస (3) ఈ నెల 17న ఇంట్లో పేస్ట్ అనుకొని ఎలకలమందు తిన్నది. కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. ఆదివారం పరిస్థితి విషమించి మృతి చెందింది. చిన్నారి తండ్రి కిషన్ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ గోపి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
గంజాయి నిందితుడిపై పీడీ యాక్ట్


