ఇన్‌ఫ్లో స్థాయిలోనే ఔట్ ఫ్లో..
వైరా రిజర్వాయర్‌కు ఈ ఏడాది
రికార్డు స్థాయిలో వరద
కుడి, ఎడమ కాల్వల ద్వారా
సాగు అవసరాలకు విడుదల
ప్రస్తుతం 2.5 టీఎంసీల నీటి నిల్వలు
రికార్డు స్థాయిలో వరద నీరు..
వైరా: జిల్లాలోని మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల్లో వైరా రిజర్వాయర్‌కు ప్రత్యేక స్థానం ఉన్నది. కొన్నే ళ్లుగా రిజర్వాయర్‌కు పూర్తిస్థాయిలో నీరు చేరుతుండడంతో అటు సాగు, ఇటు తాగునీటికి ఇబ్బంది ఎదురుకావడం లేదు. మరోపక్క పంటల సాగుకు సరిపడా నీరు అందుతుండడంతో అన్నదాతల పాలిట వరప్రదాయినిగా నిలుస్తోంది. ఇక ఈ ఏడా ది రికార్డు స్థాయిలో రిజర్వాయర్‌లోకి వరద వచ్చి చేరింది. అదే స్థాయిలో ఐదు అలుగుల ద్వారా నీరు బయటకు వెళ్లింది. తాగునీటి అవసరాల కోసం మిషన్ భగీరథ ద్వారా నెలకు 2.100 క్యూసెక్కుల నీటిని జిల్లాలోని 11మండలాలకు సరఫరా చేస్తు న్నారు. రోజుకు కోటి లీటర్లకు పైగా నీరు ఇక్కడి నుంచి ప్రజలకు అందుతోంది. కాగా, వైరా రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 2.5 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటి నిల్వ కూడా 2.5 టీఎంసీలే ఉండడంతో జలకళ ఉట్టిపడుతోంది.
రికార్డు స్థాయిలో వరద
ఈ ఏడాది రికార్డు స్థాయిలో వర్షాలు కురవడంతో ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద రిజర్వాయర్‌లోకి చేరింది. ఈ నెల 23వ తేదీవరకు 12.5 టీఎంసీల వరద రిజర్వాయర్‌లోకి వచ్చింది. ఇక 10 టీఎంసీల నీరు రిజర్వాయర్ ఐదు అలుగుల ద్వారా బయటకు వెళ్లింది. ఆగస్టు 17వ తేదీన కుడి, ఎడమ కాల్వలకు అధికారికంగా సాగునీరు విడుదల మొదలుపెట్టారు. కుడికాల్వ పరిధిలో సుమా రు 15 వేలకు పైగా ఎకరాలు సాగులో ఉండగా ఒక టీఎంసీ నీటిని వినియోగిస్తున్నారు. ఎడమ కాల్వ పరిధిలో సుమారు 9వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నాయి. ఈ కాల్వ పరిధిలో అర టీఎంసీ నీరు పొలాలకు చేరింది.
అత్యధికంగా ఈ రోజుల్లోనే..
ఈ ఏడాది జూలైలో జోరువానలు మొదలయ్యా యి. ఈ మేరకు ఆగస్టు 16వ తేదీన ఒక టీఎంసీ నీరు అలుగుల ద్వారా బయటకు వెళ్లింది. అలాగే, సెప్టెంబర్ 4వ తేదీన 0.55 టీఎంసీలు, అక్టోబర్ 5వ తేదీన 0.139 టీఎంసీలు రిజర్వాయర్ నీరు బయటకు వెళ్లినట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి.
నెల ఇన్‌ఫ్లో ఔట్ ఫ్లో
(టీఎంసీల్లో) (టీఎంసీల్లో)
జూలై 1.22 0.8 టీఎంసీలు
ఆగస్టు 5.78 5.78 టీఎంసీలు
సెప్టెంబర్ 2.77 2.77 టీఎంసీలు
అక్టోబర్ 1.239 0.867 టీఎంసీలు
ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురవడంతో వైరా ప్రాజెక్టులోకి రికార్డు స్థాయిలో వరద వచ్చి చేరింది. తద్వారా సాగు అవసరాలకు ఎలాంటి డోకా లేదు. రిజర్వాయర్‌లో ప్రస్తుతం 2.5 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ఫలితంగా తాగునీటికి కూడా సమస్య ఎదురుకాదు. –శ్రీనివాస్, ఐబీ, డీఈ
ఇన్‌ఫ్లో స్థాయిలోనే ఔట్ ఫ్లో..


