ముమ్మరంగా రోప్‌వే పనులు
ఖమ్మంరాపర్తినగర్: పర్యాటకులను ఆకర్షించేందుకు నగరంలోని ఖమ్మం ఖిల్లా మీదుగా రోప్ వే నిర్మించేందుకు పర్యాటక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. రెండు నెలల క్రితమే ప్రారంభం కావాల్సిన రోప్ వే పనులు అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభించారు. ముందుగా లోయర్ బేస్ స్టేషన్ పనులు కొనసాగుతున్నాయి కేవలం రోప్ వేకు సంబంధించిన వాటిని మాత్రమే చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.15.15 కోట్లు కేటాయించింది. పనులను పశ్చిమబెంగాల్ రాష్ట్రం కోల్‌కతాకు చెందిన ఓ కంపెనీకి అప్పగించారు. దాదాపు 236 మీటర్ల పొడవున నిర్మించే రోప్ వే పనులను సకాలంలో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులు తెలిపారు. బేస్ స్టేషన్ నిర్మాణంలో బాగా రాళ్లు తేలడంతో వాటిని తొలగిస్తున్నారు. లోయర్ స్టేషన్ అప్పర్ స్టేషన్ పనులు పూర్తికాగానే ఖిల్లాపై మ్యూజియం, మినీ థియేటర్, ఒక హోటల్ నిర్మించనున్నారు. నిర్మాణ పనులను సకాలంలో పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని, రోప్ వే పనులు పూర్తి కాగానే వెంటనే ఖిల్లాపై మిగిలిన పనులను పూర్తి చేస్తామని డీఈ రామకృష్ణ, ఏఈ ఎం.నరేశ్ తెలిపారు.


