రండీ.. చార్జింగ్ స్టేషన్ పెట్టండి !
చార్జింగ్ స్టేషన్లతో వ్యాపార వృద్ధి
● కేంద్రం నుంచి 70–80 శాతం సబ్సిడీ ● ఏఈల ద్వారా ప్రతిపాదనలకు అవకాశం
ఖమ్మంవ్యవసాయం: ఎలక్ట్రిక్ వాహనాల వాడకంపై ఆసక్తి పెరుగుతుండడంతో కొనుగోళ్లు కూడా పెరుగుతున్నాయి. దీనికి తోడు దేశీయ సాంకేతికతకు ప్రోత్సాహం, కాలుష్యం తగ్గింపు, చమురు దిగుమతులపై పెట్టుబడులను కుదించే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం ప్రధాన మంత్రి ఈ–డ్రైవ్ పథకాన్ని అమలు చేస్తుండగా పలువురు ఎలక్ట్రిక్ వాహనాలపై మొగ్గు చూపుతున్నారు. ఇలా వాహనాల సంఖ్య పెరుగుతుండడంతో చార్జింగ్ స్టేషన్లకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈనేపథ్యాన చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కేంద్రం ప్రాధాన్యత ఇస్తూ ‘ఈ డ్రైవ్’ పథకాన్ని తొలుత రెండేళ్ల కాల పరిమితితో రూపొందించగా, ఇటీవల 2028 వరకు పొడిగించింది. ఈ పథకం కింద ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఈవీ చార్జింగ్, బ్యాటరీ స్వాపింగ్ సెంటర్ల ఏర్పాటుకు కేంద్రం రూ. 2 వేల కోట్ల నిధులు కేటాయించింది.
ప్రభుత్వ సంస్థలు, రద్దీ ప్రాంతాల్లో..
ఎలక్ట్రానిక్ వెహికిల్ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఈ–డ్రైవ్ పథకం కింద సబ్సిడీలను ప్రకటించింది. ఉద్యోగులు, కార్మికులు ఎక్కువగా ఉండే ప్రభుత్వ రంగ సంస్థల్లో స్టేషన్ ఏర్పాటుకు 80 శాతం, షాపింగ్ మాళ్లు, గేటెడ్ కమ్యూనిటీలు, సినిమా థియేటర్లు, వ్యాపార కేంద్రాల్లోనైతే 70 శాతం సబ్సిడీ ఇవ్వనుంది. అంతేకాక ద్విచక్ర వాహనాల బ్యాటరీల స్వాపింగ్ సెంటర్లకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. సెంటర్ల ఏర్పాటుకు నాలుగు కేటగిరీల్లో సబ్సిడీ సౌకర్యం కల్పించనుండగా.. జాతీయ రహదారులపై 30–40 కిలోమీటర్లకు ఒకటి చొప్పున చార్జింగ్ స్టేషన్ ఏర్పాటును ప్రోత్సహించనున్నారు. ఈమేరకు ఆసక్తి ఉన్న వ్యక్తులు, సంస్థల బాధ్యులు సమీపంలోని విద్యుత్ ఏఈలను సంప్రదించవచ్చు. అవసరమైన ధ్రువ పత్రాలతో సంబంధిత డిస్కంకు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి ఈవీ చార్జింగ్ స్టేషన్ మంజూరు చేస్తారు.
ఎలక్ట్రానిక్ చార్జింగ్ స్టేషన్లతో వాహనదారులకు లబ్ధి జరుగుతుంది. కేంద్రప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయడంతో పాటు సబ్సిడీ ఇస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ సముదాయాల్లో స్టేషన్ల ఏర్పాటుతో వ్యాపార వృద్ధి కూడా ఉంటుంది. ఈ అవకాశాన్ని ఔత్సాహికులు వినియోగించుకోవాలి.
– ఇనుగుర్తి శ్రీనివాసాచారి, ఎస్‌ఈ, ఖమ్మం
రండీ.. చార్జింగ్ స్టేషన్ పెట్టండి !


