ఉపాధిలో ఈ–కేవైసీ..
కూలీల ఫొటోలతో జాబ్‌కార్డులకు అనుసంధానం త్వరలోనే ముఖ గుర్తింపు హాజరుకు అవకాశం బోగస్ కూలీల బెడదను తగ్గించేలా చర్యలు
ఖమ్మంమయూరిసెంటర్: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్) మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వాలు కీలక చర్యలు చేపట్టాయి. ముఖ్యంగా కూలీల హాజరు నమోదులో అక్రమాలకు తావు లేకుండా, నిజమైన కూలీలకు మాత్రమే లబ్ధి చేకూరేలా నూతన సాంకేతిక విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా ఇక నుంచి ఉపాధి పనులకు వచ్చే కూలీల హాజరును ఈ–కేవైసీ (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) ద్వారా నమోదు చేసేందుకు కసరత్తు వేగవంతమైంది. జిల్లాలో ఈ పథకం కింద యాక్టివ్‌గా ఉన్న కూలీల వివరాలను సేకరించడంతో పాటు వారి ఫొటోతో కూడిన వివరాలను జాబ్‌కార్డుకు అనుసంధానం చేస్తున్నారు.
ఫొటోతో అనుసంధానం
ఈ నూతన విధానంలో భాగంగా ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం పనులకు వస్తున్న (యాక్టివ్‌గా ఉన్న) కూలీలను గుర్తించి వారి ఫొటోలు, ఆధార్ వివరాలను సేకరించి జాబ్ కార్డుకు అనుసంధానం చేస్తున్నారు. ఉపాధి పథకానికి సంబంధించిన ప్రత్యేక యాప్‌లో కూలీ ఫొటోను తీయగానే, ఆటోమేటిక్‌గా జాబ్‌కార్డులోని వివరాలు, పేరు కనిపించడంతో పాటు వారి హాజరు యాప్‌లో నమోదయ్యేలా రూపొందిస్తున్నారు. ఇది పనుల నిర్వహణలో పారదర్శకతను పెంచడంతో పాటు, బోగస్ కూలీల బెడదను పూర్తిగా తగ్గిస్తుందని అధికారులు భావిస్తున్నారు.
జిల్లాలో 85 శాతం పూర్తి..
జిల్లాలోని యాక్టివ్ కూలీల ఈ–కేవైసీ ప్రక్రియ అధికారులు యుద్ధప్రాతిపదికన చేపడుతున్నారు. ఇప్పటివరకు దాదాపు 85 శాతానికి పైగా పూర్తయినట్లు సమాచారం. జిల్లాలో 2,85,055 మంది కూలీలు యాక్టివ్‌గా ఉండగా.. ఇప్పటి వరకు 2,44,759 మంది కూలీల ఈ–కేవైసీని పూర్తి చేయగా.. మరో 40,296 మందివి చేయాల్సి ఉంది. గ్రామాల్లోని సిబ్బంది కూలీల ఫొటోలను చురుగ్గా అప్‌లోడ్ చేస్తున్నారు.
త్వరలోనే ఫేస్ రికగ్నైజేషన్
ఈ–కేవైసీ అమలు తర్వాత మరింత అధునాతనంగా ఫేస్ రికగ్రైజ్ (ముఖ గుర్తింపు) ద్వారా హాజరు నమోదు చేసే విధానాన్ని కూడా త్వరలోనే అమలులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా కూలీలు నేరుగా తమ ముఖాన్ని గుర్తించే యంత్రం, యాప్ ద్వారా హాజరు వేయడం సాధ్యమవుతుంది. ఈ చర్య ఉపాధి హామీ పథకంలో పారదర్శకతకు, జవాబుదారీతనానికి కొత్త మార్గం వేస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.
పనుల్లో పారదర్శకతకు కొత్త విధానం
ఉపాధిలో ఈ–కేవైసీ..


