వరిలో తెగుళ్ల బెడద
ఎండాకు తెగులతో పంటకు నష్టం
దిగుబడి తగ్గుతుందని
ఆందోళనలో రైతన్న
చాలావరకు తాలు కంకులే..
కల్లూరు: ఈ వానాకాలం సీజన్‌లో సాగు చేస్తున్న వరిలో అధిక వర్షాల కారణంగా ఎండాకు తెగులు సోకుతోంది. కల్లూరు మండలంలో సాగర్ ఆయకట్టు కింద సుమారు 33,740 ఎకరాల్లో వరి సాగు చేశారు. జూన్, జూలై నెలల్లో వేసిన పంట బాగానే ఉన్నా, ఆగస్టులో సాగు చేసిన పొలాలకు మాత్రం ఎండు తెగులు ఆశించింది. గాలిలో తేమశాతం ఎక్కువగా ఉండడంతో ఇలా జరిగి ఉంటుందని వ్యవసాయ శాఖాధికారులు చెబుతున్నారు. అంతేకాక వరి మడి నుంచి వేరే మడిలోకి నీరు చేరినప్పుడు తెగులు కూడా వ్యాపిస్తుందని భావిస్తున్నారు. మండలంలోని సుమారు 7,500 ఎకరాల పంటకు ఈ తెగులు సోకగా, దిగుబడి పది బస్తాలైనా వస్తుందో, రాదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఏడీఏ శ్రీనివాసరెడ్డి, ఏఓ ఎం.రూప పైర్లను పరిశీలించి తెగులు నివారణపై రైతులకు సూచనలు చేశారు.
ఆరుగాలం కష్టపడి వరి సాగు చేస్తే వాతావరణంలో తేడాతో తెగుళ్లు వ్యాపించాయి. అధిక వర్షాలతో వరి పైరుకు ఎండాకు తెగులు ఆశించింది. దీంతో పంట దిగుబడి తగ్గుతుంది. ఇప్పటికే చాలావరకు తాలు కంకులు వచ్చాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు.
– రంగు లక్ష్మణ్‌రావు, రైతు
వరిలో తెగుళ్ల బెడద


