ప్రేమ, ఆప్యాయత వెల్లివిరియాలి
● ప్రజల్లో అవగాహనకు ఖమ్మం యువకుడి ప్రయత్నం ● ఖమ్మం నుంచి ఉదయ్‌పూర్‌కు సైకిల్‌యాత్ర
ఖమ్మం రాపర్తినగర్: మనుషులంతా రాగద్వేషాలు మరిచి.. ప్రేమ, ఆప్యాయతతో జీవనం సాగించాలని.. తద్వారా ఆనందమయ సమాజం ఏర్పాటుతుందని భావించిన ఓ యువకుడు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సైకిల్‌యాత్ర మొదలుపెట్టాడు. ఖమ్మంలో ఫార్మా–డీ చదువుతున్న వీఎస్.భావిన్ గతనెల 28న యాత్రను చేపట్టి మార్గమధ్యలో ప్రజలకు వివరిస్తూ ఈనెల 13న గమ్యస్థానమైన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చేరాడు.
1,500 కిలోమీటర్ల యాత్ర..
ప్రతిరోజు 100 కి.మీ. వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుని భావిన్ దాదాపు 1,500 కి.మీ. మేర సైకిల్‌యాత్ర చేశాడు. ఆసిఫాబాద్ నుంచి మహారాష్ట్రలోని చంద్రాపూర్ వరకు రోడ్డు సాఫీగా ఉండడంతో 80కి.మీ చొప్పున రోజు వెళ్లినా.. అక్కడి నుంచి దాదాపు 30 కి.మీ. వరకు రోడ్డు మరమ్మతులతో ఆలస్యమైందని పేర్కొన్నాడు. తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మీదుగా రాజస్థాన్‌లోకి ప్రవేశించిన ఆయన రాత్రి సమయాన గుడారం, పెట్రోల్‌బంక్, దేవాలయాలు, దాబాల్లో బస చేసేవాడు. తన యాత్రకు సైక్లింగ్ అసోసియేషన్ సభ్యులు సహకరించారని, ఈ యాత్ర ద్వారా కొందరిలో మార్పు వచ్చినా తన లక్ష్యం నెరవేరినట్లేనని భావిన్ పేర్కొన్నాడు.


