ఇసుక అక్రమ రవాణాకు చెక్
ముదిగొండ: నిరంతరం తనిఖీలు చేపడుతున్నా, పలు వాహనాలను సీజ్ చేస్తున్నా ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదు. దీంతో ట్రాక్టర్ల రాకపోకలను అడ్డుకునేలా ముదిగొండ మండలంలోని పెద్దమండవ, గంధసిరి మున్నేటి వద్ద గురువారం కందకాలు తీయించారు. ముదిగొండ సీఐ ఓ.మురళి ఆధ్వర్యాన కందకాలు తీయించగా, ఆయన మాట్లాడారు. గంధసిరిలోని లంక సమీపాన ఇసుకను చింతకాని మండలానికి అక్రమంగా తరలిస్తున్నారనే ఫిర్యాదులతో ట్రాక్టర్లను కట్టడి చేసేలా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
బాలుడిపై లైంగిక దాడికి యత్నం
ఖమ్మం అర్బన్: ఖమ్మం అర్బన్ పోలీస్‌స్టేషన్ పరిధి ఓ గ్రామానికి చెందిన ఐదేళ్ల బాలుడిపై అదే గ్రామ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి లైంగిక దాడికి యత్నించాడు. అంతేకాక వికృత చర్యలకు పాల్పడినట్లు బాధిత చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆపై విద్యార్థిని కోర్టు ఆదేశాలతో చైల్డ్ హోమ్‌కు తరలించినట్లు సీఐ భానుప్రకాష్ తెలిపారు.
ప్రేమ వేధింపులు భరించలేక బాలిక ఆత్మహత్య
కల్లూరురూరల్: మండలంలోని పేరువంచకు చెందిన బాలిక ప్రేమ పేరిట ఎదురవుతున్న వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామానికి చెందిన తురక అనిల్ కొన్నాళ్లుగా ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న బాలికను ప్రేమ, పెళ్లి పేరిట వేధిస్తుండడమే కాక అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిసింది. దీంతో ఆందోళనకు గురైన ఆమె బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయాన ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదుతో గురువారం అనిల్‌పై కేసు నమోదు చేసినట్లు కల్లూరు ఎస్సై హరిత తెలిపారు.


