పత్తి కొనుగోళ్లకు అడ్డంకులు | - | Sakshi
Sakshi News home page

పత్తి కొనుగోళ్లకు అడ్డంకులు

Sep 28 2025 7:03 AM | Updated on Sep 28 2025 7:03 AM

పత్తి

పత్తి కొనుగోళ్లకు అడ్డంకులు

● సీసీఐ టెండర్లకు జిన్నింగ్‌ మిల్లులు దూరం ● నిబంధనలు మార్చాల్సిందేనని డిమాండ్‌ ● అక్టోబర్‌ ఆరంభం నుంచి పత్తి కొనుగోళ్లు కష్టమే..

పంట కొనుగోళ్లకు ఏర్పాట్లు

● సీసీఐ టెండర్లకు జిన్నింగ్‌ మిల్లులు దూరం ● నిబంధనలు మార్చాల్సిందేనని డిమాండ్‌ ● అక్టోబర్‌ ఆరంభం నుంచి పత్తి కొనుగోళ్లు కష్టమే..

ఖమ్మంవ్యవసాయం: పత్తి పంట సీజన్‌ ముంచుకొచ్చినా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ఏర్పాటవుతాయో స్పష్టత రావడం లేదు. అక్టోబర్‌ మొదటి నుంచి పత్తి కొనుగోళ్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించగా.. కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) జిన్నింగ్‌ మిల్లుల ఎంపికకు కసరత్తు మొదలుపెట్టింది. అయితే, టెండర్ల దాఖలుకు మిల్లర్లు ముందుకు రావడంలేదు. ఇప్పటికే గ్రామాలు, మార్కెట్లలో పత్తి క్రయవిక్రయాలు మొదలుకాగా గరిష్టంగా రూ.7,500, మోడల్‌ ధర రూ.6,500, కనిష్టంగా రూ.4,300 ధరే దక్కుతోంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది 8 తేమశాతం కలిగిన పత్తికి గరిష్టంగా క్వింటాకు రూ. 8,110 ధర నిర్ణయించింది. 12 శాతం వరకు తేమ ఉన్న పత్తిని కొనుగోలు చేయాలని నిర్ణయించారు. కానీ ప్రభుత్వ కేంద్రాలు లేకపోవడంతో వ్యాపారులు ధర విషయంలో ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు.

రెండు సార్లు ఆహ్వానించినా..

ఖమ్మం జిల్లాలోని 2,25,613 ఎకరాల్లో పత్తి సాగు కాగా 27,07,356 క్వింటాళ్లు, భద్రాద్రి జిల్లాలో 2,40,345 ఎకరాల నుంచి 28,05,576 పత్తి దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఏటా సీసీఐ ఆధ్వర్యాన జిన్నింగ్‌ మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు చేపడుతారు. మిల్లులను టెండర్ల ద్వారా ఎంపిక చేయాల్సిఉండడంతో ఈసారి యజమానులు దూరంగా ఉంటున్నారు. ఆగస్టు 9న తొలిసారి టెండర్లు ఆహ్వానించి అదేనెల 31వ తేదీ వరకు గడువు విధించారు. టెండర్ల నిబంధనలను కఠినంగా ఉన్నాయని మిల్లుల యజమానులు రాకపోవడంతో సెప్టెంబర్‌లో రెండో సారి ఆహ్వానించినా యజమానులు పాల్గొనలేదు. దీంతో మూడోసారి టెండర్ల నిర్వహణకు సీసీఐ సిద్ధమవుతోంది. సీసీఐ నిబంధనల కారణంగానే తాము టెండర్లు దాఖలు చేయడం లేదని మిల్లుల యజమానులు చెబుతుండగా.. మూడోసారి టెండర్లలో మార్పులు చేస్తారా, లేదా అనేది తేలాల్సి ఉంది. కాగా, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో వ్యవసాయ మార్కెట్ల వారీగా పత్తి కొనుగోళ్లకు జిన్నింగ్‌ మిల్లులను నోటిఫై చేసిన అధికారులు ప్రభుత్వం, సీసీఐకి ప్రతిపాదించారు. ఖమ్మం జిల్లాలో తొమ్మిది, భద్రాద్రి జిల్లాలో ఆరు మిల్లులను నోటిఫై చేసి కొనుగోళ్లు సాఫీగా జరిగేలా కమిటీలను కూడా నియమించారు. ఇదంతా బాగానే ఉన్నా టెండర్ల ప్రక్రియ ఎటూ తేలకపోవడంతో పత్తి కొనుగోళ్లు ఎప్పుడు మొదలవుతాయో స్పష్టత రావడం లేదు.

మరికొన్ని సవాళ్లు

పత్తి కొనుగోళ్లకు టెండర్ల ప్రక్రియ ఓ సవాల్‌గా ఉండగా, వ్యవసాయ శాఖ పంట నమోదు ప్రక్రియ కూడా ఇంకో అడ్డంకిగా మారనుంది. యూరియా కొరత నేపథ్యాన వ్యవసాయ విస్తర్ణాధికారులు ఆ పనుల్లో నిమగ్నమై ఉండగా.. పంట నమోదు ప్రక్రియ పూర్తికాలేదు. వ్యవసాయ శాఖ నమోదు చేసిన సాగు విస్తీర్ణం ఆధారంగా పత్తి కొనుగోళ్లు ఉంటాయి. దీనికి తోడు ఈ ఏడాది కేంద్రప్రభుత్వం ‘కపాస్‌ కిసాన్‌ యాప్‌’ను ప్రవేశ పెట్టింది. రైతులు ఈ యాప్‌లో పంట విక్రయానికి స్లాట్‌ బుక్‌ చేసుకోవాల్సి ఉండడంతో మారుమూల గ్రామాల రైతులకు ఇబ్బంది పడే అవకాశముంది.

ప్రభుత్వ ఆదేశాల మేరకు పత్తి కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఎంపిక చేసిన మిల్లుల్లో కొనుగోళ్లు సజావుగా సాగేలా వివిధ శాఖల అధికారులతో కమిటీలు నియమించాం. జిన్నింగ్‌ మిల్లులకు టెండర్ల ప్రక్రియ పూర్తికాగానే పత్తి

కొనుగోళ్లు మొదలవుతాయి.

– ఎం.ఏ.అలీం,

జిల్లా మార్కెటింగ్‌ శాఖ అధికారి, ఖమ్మం

పత్తి కొనుగోళ్లకు అడ్డంకులు1
1/1

పత్తి కొనుగోళ్లకు అడ్డంకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement