
అటవీ సంరక్షణ కమిటీలతో జీవనోపాధి
● డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ● 234 మంది సభ్యులకు యూనిట్ల పంపిణీ
మధిర: అటవీ సంరక్షణ కమిటీలు అటవీ సంరక్షణలో మాత్రమే కాకుండా గ్రామీణ కుటుంబాలకు జీవనోపాధి అవకాశాలు కల్పించడంలోనూ కీలకపాత్ర పోషిస్తున్నాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. మధిర అటవీ రేంజ్ పరిధి గుంటుపల్లి, గోపవరం గ్రామ వన సర్కాశన్ సమితి సభ్యుల జీవనోపాధి, సామాజిక, ఆర్థికాభివృద్ధి కోసం యూనిట్లను సోమవారం మధిరలో డిప్యూటీ సీఎం భట్టి పంపిణీ చేసి మాట్లాడారు. ప్రకృతి పరిరక్షణతో పాటు సమాజ సమగ్రాభివృద్ధికి అటవీ సంరక్షణ కమిటీలు కృషి చేస్తున్నాయని తెలిపారు. జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ విక్రమ్‌సింగ్ మాట్లాడుతూ అటవీ సంరక్షణ కమిటీల అభివృద్ధికి అన్నిరకాల చేయూతనిస్తున్నామని చెప్పారు. గ్రామీణ యువత, మహిళలకు అందించే యూనిట్లతో వారి ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుందని తెలిపారు. ఈమేరకు 234 మంది సభ్యులకు 115 పవర్ టిల్లర్లు, 10రోటోవేటర్లు, 11ట్రాక్టర్ కల్టివేటర్లు పంపిణీ చేశామని వెల్లడించారు. వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బండారు నరసింహారావు, మధిర రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ బి.శ్రీనివాసరెడ్డి, ఉద్యోగులు పాల్గొన్నారు.
స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి
చింతకాని: స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో గెలిచేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క సూచించారు. హైదరాబాద్ వెళ్లే క్రమాన చింతకాని మండలం నాగులవంచలో మత్కేపల్లి మార్కెట్ చైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు ఇంటి వద్ద ఆయన ముఖ్యనాయకులతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు, పోటీపై సూచనలు చేశారు. అలాగే, రైతుల అభ్యున్నతికి పాటుపడాలని మార్కెట్‌కు చైర్మన్‌కు సూచించారు. వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నాయకులు మడుపల్లి భాస్కర్, కొప్పుల గోవిందరావు, కన్నెబోయిన గోపి, బందెల నాగార్జున్, ఆలస్యం బస్వయ్య, కంభం వీరభద్రం, షేక్ అబ్దుల్ నబీ, తదితరులు పాల్గొన్నారు.