
ఐస్ స్కేటింగ్‌లో పతకాల పంట
● మోటమర్రి క్రీడాకారిణి నయనశ్రీ ప్రతిభ ● అంతర్జాతీయ స్థాయి పోటీలకు వెళ్లడానికి ఆర్థిక ఇక్కట్లు
బోనకల్: ఐస్ స్కేటింగ్ అంటే ఆమెకు ప్రాణం. దీంతో ఆటపైనే దృష్టి సారించగా.. తల్లిదండ్రులు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నా ప్రోత్సహించడంతో పతకాల మోత మోగిస్తోంది. బోనకల్ మండలం మోటమర్రి గ్రామానికి చెందిన తాళ్లూరి నయనశ్రీ ప్రస్తుతం బెంగళూరులో డిగ్రీ చదువుతోంది. గ్రామానికి చెందిన నారాయణరావు – వీణ దంపతుల ఏకై క కుమార్తె అయిన నయనశ్రీ తొమ్మిదేళ్ల వయస్సు నుంచే హైదరాబాద్ కోట్ల విజయభాస్కరరెడ్డి స్టేడియంలో స్కేటింగ్‌లో శిక్షణ తీసుకుంటోంది. ఇమె ప్రతిభను గుర్తించిన కోచ్ ఐస్ స్కేటింగ్‌పై దృష్టి సారించాలని సూచించగా.. 2017లో తొలిసారి ఢిల్లీలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంది. అలాగే, 2018లో సింగపూర్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో రజిత పతకం సాదించింది. నాటి నుంచి నేటి వరకు జరిగిన అంతర్జాతీయ స్థాయి పోటీల్లో 17 పతకాలు సాధించగా.. జాతీయ స్థాయిలో 23, రాష్ట్రస్థాయిలో 20కి పైగా పతకాలను గెలుచుకుంది. గత నెల డెహ్రాడూన్‌లో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో రెండు రజితం, రెండు కాంస్య పతకాలను సాధించిన ఆమె నవంబర్‌లో కజకిస్తాన్‌లో జరిగే జూనియర్ వరల్డ్ కప్ పోటీలకు సిద్ధమవుతుంది. అయితే, శిక్షణ కోసం సౌత్ కొరియా వెళ్లాల్సి ఉండగా.. దాదాపు రూ.10లక్షల మేర నగదు అవసరమతుంది. నయనశ్రీ తల్లిదండ్రులు చిన్నపాటి ఉద్యోగాలు చేస్తుండటంతో వారు భారం మోసే పరిస్థితి లేదు. దీంతో దాతలు, క్రీడాభిమానులు సహరించాలని కోరుతున్నారు.

ఐస్ స్కేటింగ్‌లో పతకాల పంట