
నాటి కట్టడం.. నేటికీ పదిలం
మరో వందేళ్లయినా నిలుస్తుంది
● ఔరా అనిపించేలా వైరా రిజర్వాయర్ ● 103 ఏళ్ల చారిత్రక అనవాళ్లు ● 1923లో పునాది.. 1930లో పూర్తి
నేడు ఇంజనీర్స్ డే
వైరా: వైరా రిజర్వాయర్ నిర్మాణానికి 103ఏళ్ల చరి త్ర ఉంది. నిజాం పాలనలోనే ఈ రిజర్వాయర్ నిర్మాణం పూర్తయింది. 25వేల ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు అందించడంతో పాటు మరెన్నో ఎత్తిపోతల పథకాల ఆధారంగా ఉంటూ జిల్లా చరిత్రలోనే ప్రత్యేకత చాటుకుంటోంది.
ఇదీ చారిత్రక నేపథ్యం..
1923లో నాటి నిజాం నవాజ్ నీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బహుదుర్ ఈ రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టగా ఏడేళ్లలో పనులు పూర్తయి 1930లో అందుబాటులోకి వచ్చింది. నిజాం ఆదేశాల మేరకు ఆనాటి నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ స్థాహెద్ జాగా నవాబ్, తిలావత్ జంగ్ బహుదూర్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఉమ్మడి జిల్లాలోని ఇల్లెందు, కారేపల్లి, ఏన్కూరు, కామేపల్లి, కొణిజర్ల మండలాల్లోని పగిడేరు, కిసరా లచ్చమ్మ గుట్టల మధ్య నుంచి ప్రవహించే రాళ్లవాగు, తల్లాడ మండలం రెడ్డిగూడెం, వైరా మండలం బ్రాహ్మణపల్లి మధ్య కలిసి నదిగా ఏర్పడగా.. అక్కడే ప్రాజెక్టు కట్టారు. 2.50 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల ఈ రిజర్వాయర్‌ను డంగు సున్నం, రాయితో నిర్మించారు.
రూ.35.90 లక్షల వ్యయంతో..
వైరా ప్రాజెక్టు నిర్మాణానికి అప్పట్లో రూ.35,90,275 ఖర్చు చేశారు. ఆనకట్టు పొడవు 1.78 కిలోమీటర్లు, ఎత్తు 88 అడుగులు, 4 వేల ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంది. రిజర్వాయర్‌కు రెండు ప్రధాన కాల్వలు ఉన్నాయి. కుడి కాల్వ 24 కిలోమీటర్లు, ఎడమ కాల్వ 16 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. 2010లో జపాన్ బ్యాంకు నిధులతో కుడి, ఎడమ కాల్వల ఆధునికీకరణ జరగగా ప్రస్తుతం రెండో దశ పనులు కొనసాగుతున్నాయి.
2005లో అత్యధికంగా..
వైరా రిజర్వాయర్ చరిత్రలో 2005 సెప్టెంబర్‌లో అత్యధికంగా వరద నీరు వచ్చి చేరింది. 26.6 అడుగులకు నీటిమట్టం చేరగా సుమారు 95 వేల క్యూసెక్కుల నీరు ఒక్కరోజే బయటకు వెళ్లింది. ఈ ఏడాది ఇప్పటివరకు 6.2టీఎంసీలు నీరు కృష్ణానదిలో కలిసింది.
వైరా రిజర్వాయర్‌కు చారిత్రక అనవాళ్లు ఉన్నాయి. ఆనకట్టను 88 అడుగుల లోతులో నిర్మించారు. స్పిల్‌వే ప్రాంతంలో నిర్మించగా.. గతంలో 4 అలుగులు మాత్రమే ఉండేవి. 2009లో అదనపు అలుగులు నిర్మించడంతో రోజుకు ఒక క్యూసెక్కు నీరు కూడా బయటకు పంపే అవకాశం ఉంది. మరో వందేళ్లయినా ఈ రిజర్వాయర్‌కు ఢోకా లేదు.
– శ్రీనివాస్, ఐబీ, డీఈ, వైరా

నాటి కట్టడం.. నేటికీ పదిలం