
భూసేకరణ వేగవంతం చేయండి
ఖమ్మం సహకారనగర్ : జాతీయ రహదారుల నిర్మాణ పనుల్లో వేగం పెంచేందుకు వీలుగా మిగిలిన భూసేకరణ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం జాతీయ రహదారుల నిర్మాణ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఖమ్మం – దేవరపల్లి, నాగపూర్ – అమరావతి జాతీయ రహదారుల నిర్మాణం నిర్ణీత సమయంలో పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. ఖమ్మం – దేవరపల్లి రహదారికి ధంసలాపురం వద్ద ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ కొరకు 6.22 ఎకరాల భూసేకరణ చేయాలని అన్నారు. ఇందులో 3.16 ఎకరాలకు ఇప్పటికే అవార్డ్ పాస్ చేశామని, మిగతా 3.06 ఎకరాల భూసేకరణకు చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. మేజర్ బ్రిడ్జిని నవంబర్ లోగా, ఆర్‌ఓబీ పనులు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలన్నారు. కొదుమూరు వద్ద 400 కేవీఈహెచ్ టీ షిఫ్టింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని చెప్పారు. నాగపూర్ – అమరావతి ప్యాకేజీ 1, 2 భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని, అక్టోబర్‌లోగా పరిహార చెల్లింపు పూర్తిచేసి, భూమిని స్వాధీనం చేసుకోవాలని అన్నారు. సమావేశంలో ఖమ్మం ఆర్డీఓ నర్సింహారావు, ఎన్‌హెచ్ అధికారులు రామాంజనేయ రెడ్డి, దివ్య, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సైదులు తదితరులు పాల్గొన్నారు.
ప్రశాంతంగా లైసెన్స్ సర్వేయర్ సప్లిమెంటరీ..
నగరంలోని ఎస్‌ఆర్ బీజీఎన్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళా శాలలో ఆదివారం నిర్వహించిన లైసెన్స్ సర్వేయర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఉదయం సెషన్ థియరీ పరీక్షకు 129 మంది అభ్యర్థులకు గాను 128 మంది, మధ్యాహ్నం పరీక్షకు 205 మందికి గాను 202మంది అభ్యర్థులు హాజరయ్యారని వివరించారు.
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి