
లోక్ అదాలత్‌లో 4,625 కేసుల పరిష్కారం
ఖమ్మంక్రైం: జిల్లాలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌కు విశేష స్పందన లభించిందని, 4,625 కేసులు పరిష్కారం అయ్యాయని సీపీ సునీల్‌దత్ ఆదివారం ఒక ప్రకటలో తెలిపారు. సైబర్ క్రైమ్ కేసుల్లో రూ.52లక్షలకు పైగా బాధితులకు రీఫండ్ మొత్తం అందజేశారని పేర్కొన్నారు. రాజీ మార్గమే రాజమార్గమని, లోక్ అదాలత్ ద్వారా ఇరు వర్గాలకు న్యాయం జరుగుతుందని అవగాహన కల్పించి, కేసుల పరిష్కారానికి కృషి చేసిన పోలీస్ అధికారులు, సిబ్బందిని సీపీ అభినందించారు. సహకరించిన న్యాయవాదులు, కక్షిదారులు, న్యాయసేవాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
‘రాజీవ్ స్వగృహ’
వేలానికి నిర్ణయం
ఖమ్మంరూరల్ : గృహ నిర్మాణ శాఖ ప్రతిపాదన, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలేపల్లిలోని రాజీవ్ స్వగృహ బహుళ అంతస్తుల భవనాల బహిరంగ వేలం నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు టీజీఓస్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు తెలిపారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్ స్వగృహ భవన సముదాయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇందులో ఫ్లాట్‌లు కొన్నవారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, మున్నేరు వరద ఇటు వైపు రాకుండా రిటైనింగ్‌వాల్ నిర్మిస్తున్నారని, కొనుగోలుదారులు అపోహ పడొద్దని సూచించారు. ఏదులాపురం మున్సిపాలిటీ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నందున ప్రభుత్వ ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బహుళ అంతస్తుల భవనాల్లో ఎనిమిది బ్లాక్‌లు, తొమ్మిది ఫ్లోర్లు, ఒక్కో ఫ్లోరుకు ఎనిమిది ఫ్లాట్లు ఉన్నాయని వివరించారు.
‘విత్తనం నుంచి మహావృక్షంగా’ పుస్తకావిష్కరణ
ఖమ్మంగాంధీచౌక్: పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య జీవిత చరిత్రపై రచయిత నరేష్ రాసిన ‘విత్తనం నుండి మహావృక్షంగా వనజీవి జీవితం’ పుస్తకాన్ని స్థానిక ఆక్స్‌ఫర్డ్ హైస్కూల్‌లో పలువురు రచయితలు, కవులు ఆదివారం ఆవిష్కరించారు. అక్షరాల తోవ సాహితీ సంస్థ ఆధ్వర్యంలో దాసరోజు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సామాజికవేత్త డాక్టర్ కడవెండి వేణుగోపాల్, కవులు, రచయితలు, సాహితీవేత్తలు సీతారాం, అట్లూరి వెంకటరమణ, సైదులు, ఐనాల నయీమీ పాషా, వురిమళ్ల సునంద, వనజీవి రామయ్య సతీమణి జానకమ్మ, నామా పురుషోత్తం, రాచమళ్ల ఉపేందర్, సయ్యద్ షఫీ, కన్నెగంటి వెంకటయ్య, రమణ, బ్రహ్మం, నాగమోహన్ తదితరులు పాల్గొన్నారు.
కార్టూన్ పోటీలకు
ఎంట్రీల ఆహ్వానం
ఖమ్మంగాంధీచౌక్ : వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో తెలుగు వికాసం శీర్షికతో కార్టూన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు సారస్వత పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విజేతలకు ప్రథమ బహుమతిగా రూ. 5,116, ద్వితీయ బహుమతిగా రూ. 3,116, తృతీయ బహుమతి రూ. 2,116తో పాటు మూడు ప్రత్యేక నగదు బహుమతులు రూ. 516 చొప్పున, ప్రశంసాపత్రాలు అందిస్తామని వివరించారు. వయసుతో నిమిత ్తం లేకుండా ఒక్కొక్కరు రెండు కార్టూన్లు పంపొచ్చని, ఏ4 సైజ్‌లో ఉండాలని, గతంలో ప్రచురితమైనవి పంపొద్దని సూచించారు. అక్టోబర్ 10 నాటికి నిర్వాహకులకు అందాలని, విజేతలను అక్టోబర్ 29న ప్రకటిస్తామని, తెలుగు మహాసభల సందర్భంగా నగదు బహుమతులు ప్రదానం చేస్తామని తెలిపారు. కార్టూన్లను 98660 84124 వాట్సాప్ నంబర్‌కు పంపించాలని కోరారు.
నేడు గిరిజన దర్బార్
భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల ఐటీడీఏ యూనిట్ అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే దర్బార్‌లో గిరిజనులు తమ సమస్యలపై అర్జీలను అందజేయాలని పీఓ పేర్కొన్నారు.

లోక్ అదాలత్‌లో 4,625 కేసుల పరిష్కారం