
పటిష్టం.. ‘దుమ్ముగూడెం’
● ఆనకట్ట నిర్మించి 160 ఏళ్లు ● నిర్మాణంలో బ్రిటిష్ ఇంజనీర్ సర్ ఆర్థర్ కాటన్ ప్రతిభ
అశ్వాపురం/భద్రాచలంటౌన్: దుమ్ముగూడెం ఆనకట్ట, కిన్నెరసాని ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ ప్రతిభకు దర్పణం పడుతున్నాయి. ఏ స్థాయిలో వరదలు వచ్చినా తట్టుకోగలుగుతున్నాయి. సోమవారం ఇంజనీర్స్ డే సందర్భంగా ఆ ప్రాజెక్ట్‌ల నిర్మాణం గురించి తెలుసుకుందాం. గోదావరి నదిపై 160 ఏళ్ల క్రితం 1865లో సర్ ఆర్థర్ కాటన్ దుమ్ముగూడెం ఆనకట్టను రాతి కట్టడంతో నిర్మించారు. 160 ఏళ్లు గడిచినా చెక్కు చెదరలేదు. గోదావరికి పలుమార్లు వరదలు వచ్చినా దెబ్బతినలేదు. ఆనకట్ట ఆధారంగా మణుగూరు భారజల కర్మాగారం నిర్మించగా గోదావరి నుంచి నీరు సేకరించి భారజలం ఉత్పత్తి చేస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ రాజీవ్‌సాగర్ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేసి పనులు చేపట్టగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం రీడిజైన్ చేసి సీతారామ ప్రాజెక్ట్‌గా మార్చి పనులు చేపట్టింది. సీతమ్మ సాగర్ నిర్మాణం సైతం చేపడుతోంది. ఇక్కడి నుంచే జిల్లా వ్యాప్తంగా గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందిస్తున్నారు. ఆనకట్ట వర్షాకాలంలో నీరు ఉప్పొంగుతూ, శీతాకాలంలో నీరు జాలువారుతూ, వేసవికాలంలో అశ్వాపురం, దుమ్ముగూడెం మండలాలకు వారధిగా మూడు కాలాల్లో ఒక్కో అందంతో పర్యాటకులను ఆకట్టుకుంటోంది.
జల రవాణా కోసం..
జల రవాణాను అభివృద్ధి చేసే క్రమంలో బ్రిటిష్ ఇండియా ఆనకట్ట నిర్మాణం చేపట్టింది. నదిలో జల ప్రవాహం తక్కువగా ఉన్న సమయంలో కూడా రవాణా ఆగకుండా నిత్యం నీరు ప్రవహించే విధంగా దుమ్ముగూడెం నిర్మాణం చేపట్టారు. గోదావరి నది మధ్యలో ఉండే లంకకు ఇరువైపులా రెండు ఆనకట్టలు నిర్మించారు. మొదటి దుమ్ముగూడెం లంక, అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం మధ్య, రెండో లంకకు దుమ్ముగూడేనికి మధ్య ఉన్నాయి. ఇక్కడి నుంచి రాజమండ్రి వరకు లాంచీల ద్వారా వాణిజ్య రవాణా సాగేది. నిర్మాణంలో కాటన్ ఇంజనీరింగ్ ప్రతిభ చూపాడు. కోడి గుడ్డు సొన, సున్నం, బంకమట్టిని పశువులతో గానుగ ఆడించి ఆ మిశ్రమంతో రాళ్లను పేర్చి ఆనకట్ట నిర్మించారు. అప్పటి నుంచి జిల్లా ప్రజలకు తాగు, సాగునీటి, పారిశ్రామిక వనరుగా మారింది.