కదనరంగంలో కొదమసింహాలై... | - | Sakshi
Sakshi News home page

కదనరంగంలో కొదమసింహాలై...

Sep 15 2025 8:37 AM | Updated on Sep 15 2025 8:37 AM

కదనరం

కదనరంగంలో కొదమసింహాలై...

●ఉమ్మడి జిల్లాలో..

నిజాం రాజ్యంలో రైతులపై పెచ్చరిల్లిన దొరస్వామ్యం

జమీందార్ల ఆగడాలకు వ్యతిరేకంగా మొదలైన పోరాటం

పేరంటాలపల్లిలో విప్లవకారులకు సాయుధ శిక్షణ

తెలంగాణ సాయుధ పోరాటం అనగానే దొడ్డి కొమురయ్య, షేక్‌ బందగీ, చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, భీంరెడ్డి నర్సింహారెడ్డి తదితర ఉమ్మడి వరంగల్‌, నల్లగొండ జిల్లాలకు చెందిన పోరాట యోధులే గుర్తుకొస్తారు. ఆరోజుల్లో పల్లెల్లో అరాచక పాలనకు కేంద్రాలుగా ఉన్న దొరల గడీలు, వారికి మద్దతుగా నిలిచిన నైజాం సర్కార్‌, అతని క్రూరసైన్యంలో భాగమైన రజాకార్లకు వ్యతిరేకంగా ప్రజలను వారు ఏకం చేశారు. చేతిలో రాళ్లు, వడిసేల, గుత్ప(కర్రలు)లనే ఆయుధాలుగా చేసుకుని పోరాటం చేశారు. అయితే ఈ పోరాటంలో విప్లవకారులకు విల్లంబులు ఎక్కుపెట్టడం నుంచి జిలిటెన్‌ స్టిక్స్‌తో దాడులు చేయడం వరకు నేర్పింది ఆనాటి ఉమ్మడి ఖమ్మం జిల్లా.. నేటి భద్రాద్రి జిల్లానే. కానీ ఈ చారిత్రక అంశాలు అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు. దీంతో సాయుధ రైతాంగ పోరాటంలో జిల్లా పాత్ర ఈనాటి ప్రజానీకానికి ఎక్కువగా తెలియకుండా పోయింది. ఆనాటి వివరాలను ‘సాక్షి’ వెలికితీసే ప్రయత్నంలో వెలుగుచూసిన అంశాలపై నేటి నుంచి ప్రత్యేక కథనాలు.. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం

ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆంధ్రా ప్రాంతానికి దగ్గరగా ఉండడంతో కమ్యూనిస్టుల ప్రభావం ఈ జిల్లాపై ఎక్కువగా పడింది. మధిర, ఇల్లెందు వంటి పట్టణాలే కాక పాల్వంచ, కల్లూరు, అశ్వారావుపేట సంస్థానాల్లో వేలాది ఎకరాలు కలిగిన భూస్వాములకు వ్యతిరేకంగా ఉద్యమాలు మొదలయ్యాయి. కార్మికులు సంఘాలను ఏర్పాటు చేసుకుని నిజాం నిరంకుశ విధానాలకు ఎదురుతిరిగారు. మరోవైపు రోజురోజుకూ గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిస్టుల ప్రభావం పెరిగిపోతుండడంతో అడ్డుకట్ట వేసేందుకు కాశీం రజ్వీ నేతృత్వంలో రజాకార్ల పేరుతో ప్రత్యేక సేనలు గ్రామాల్లో అడుగుపెట్టాయి. దీంతో కమ్యూనిస్టు విప్లవకారులు, రజాకార్ల మధ్య జిల్లాలోని అనేక గ్రామాల్లో పోరాటాలు జరిగాయి.

పోరాట నేపథ్యం

భారత దేశంలో ఓ వైపు బ్రిటిష్‌ సామ్రాజ్యం కొనసాగుతుంటే వారి సహకారంతో నిజాం రాజులు హైదరాబాద్‌ స్టేట్‌లో పాలన సాగించారు. రాష్ట్ర సాగుభూమిలో దాదాపు నాలుగో వంతుకు పైగా జమీందార్లు, దేశ్‌ముఖ్‌ల చేతుల్లో ఉండేది. సాధారణ రైతులు ఈ జమీందార్ల భూముల్లో సాగు చేసిన తర్వాతే తమ సొంత పొలాలను దున్నుకోవాల్సి వచ్చేది. చేతి వృత్తుల వారు ఉచితంగా అన్ని రకాల సేవలు చేయాల్సి వచ్చేది. సామాన్యులు రేయింబవళ్లు గొడ్డు చాకిరీ చేసినా నోట్లోకి నాలుగు వేళ్లూ పోయేవి కాదు. మరోవైపు భారత స్వాతంత్య్ర సమరంలో అగ్రభాగాన ఉన్న కాంగ్రెస్‌.. స్వదేశీ సంస్థానాల విషయంలో జోక్యం చేసుకోకూడదనే నిర్ణయం కారణంగా నైజాం రాజ్యంలోని ప్రజల కడగండ్లపై పెద్దగా దృష్టి పెట్టలేదు. ఫలితంగా ప్రభుత్వంపై ప్రజల్లో పెల్లుబికే ఆగ్రహ జ్వాలలను ఒడిసిపట్టుకునే రాజకీయ పరిస్థితులు లేవు. నిజాం రాజ్యంలో తెలుగును అధికార భాషగా మార్చాలనే నినాదంతో ఆంధ్ర మహాసభ పేరుతో కమ్యూనిస్టులు ముందుకొచ్చారు. దున్నేవాడిదే భూమి నినాదంతో ప్రజల్లో నమ్మకం పొందారు. ప్రజలను సమీకరించి దొరల పెత్తనానికి సవాల్‌ విసిరారు. అలా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం 1946 జూన్‌ 4న మొదలైంది.

ఫలించిన ‘అల్లూరి’ శిక్షణ..

భద్రాచలం నుంచి విశాఖపట్నం మధ్య ఉన్న తూర్పు కనుమల్లో అల్లూరి సీతారామరాజు నిర్వహించిన గెరిల్లా పోరాటం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులను ఆకర్షించింది. దీంతో భద్రాచలం ఏజెన్సీలోని వరరామచంద్రాపురం(వీఆర్‌ పురం) మండలం పేరంటాలపల్లిలో అల్లూరి సీతారామరాజు సమకాలికుడు, ఉద్యమ సహచరుడిగా పేరున్న సింగరాజు సాధువు వద్దకు శిక్షణ కోసం విప్లవకారులు వెళ్లారు. అక్కడ సుమారు 200 మంది గెరిల్లా యుద్ధతంత్రంలో శిక్షణ తీసుకుని తిరిగి పోరు భూమికి వచ్చారు. మరోవైపు ఇల్లెందు, కొత్తగూడెం బొగ్గు గనుల్లో ఉపయోగించే పేలుడు పదార్థాల గిడ్డంగులపై విప్లవకారులు దాడులు చేశారు. ఇక్కడి నుంచి ఎత్తుకెళ్లిన బాంబులనే ఆ తర్వాత సైనిక వాహనాలు పేల్చివేయడానికి, నిజాం పోలీసు క్యాంపులపై దాడులు చేయడానికి ఉపయోగించారు. ఈ క్రమంలో భద్రాద్రి జిల్లాలో ప్రత్యేక కోయ దళాలు వెలిశాయి. దీంతో నిజాం రజాకార్లపై శిక్షణ పొందిన విప్లవకారుల పోరాటానికి జిల్లా వేదికగా మారింది.

సాయుధ పోరాటంలో ప్రత్యేకం.. ఉమ్మడి ఖమ్మం

1

కదనరంగంలో కొదమసింహాలై...1
1/1

కదనరంగంలో కొదమసింహాలై...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement