
జమలాపురంలో ప్రత్యేక పూజలు
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. శ్రీవారి పాదంతో పాటు స్వామి మూలవిరాట్‌కు అర్చకులు పంచామృతంతో అభిషేకాలు చేశారు. అలాగే, స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి నిత్యకల్యాణం జరిపించాక, భక్తుల సమక్షాన పల్లకీ సేవ నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఆలయ ఈఓ కొత్తూరి జగన్మోహన్‌రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సిబ్బంది పాల్గొన్నారు.
టెట్ తీర్పుపై ప్రభుత్వం అప్పీల్ చేయాలి
ఖమ్మం సహకారనగర్: ఉపాధ్యాయులు సర్వీస్‌లో కొనసాగాలన్నా, పదోన్నతి పొందాలన్నా టెట్ తప్పక ఉత్తీర్ణత సాధించాలంటూ వెలువడిన కోర్టు తీర్పు సీనియర్ ఉపాధ్యాయులకు అశనిపాతంలా మారిందని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఖమ్మంలో శనివారం జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో వారు మాట్లాడుతూ కోర్టు తీర్పు సీనియర్ ఉపాధ్యాయులకు నష్టం కలిగించేలా ఉన్నందున రాష్ట్రప్రభుత్వం తీర్పుపై అప్పీల్ చేసి సీనియర్ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరారు. అంతేకాక పదోన్నతుల్లో మిగిలిన ఖాళీ పోస్టులకు అర్హులను ఎంపికచేయాలని, గిరిజన సంక్షేమశాఖ, మోడల్ స్కూళ్ల ఉపాధ్యాయుల పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలన్నారు. తొలుత ఇటీవల మరణించిన పూర్వ జిల్లా అధ్యక్షుడు జియావుద్దీన్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. నాయకులు జీవీ.నాగమల్లేశ్వరరావు, బుర్రి వెంకన్న, షమీ, రాందాస్, నర్సయ్య, సురేష్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం మీదుగా
మరో ప్రత్యేక రైలు
ఖమ్మం రాపర్తినగర్: ఖమ్మం మీదుగా ఇప్పటికే ఉన్న వారాంతపు ప్రత్యేక రైలుకు తోడు మరో రైలును రైల్వే శాఖ ప్రకటించింది. నాందేడ్ – తిరుచానూర్ మధ్య ఈనెల 16, 23, 30వ తేదీల్లో ఈ రైలు ప్రారంభమవుతుందని ఖమ్మం సీసీటీఓ రాజగోపాల్ తెలిపారు. తిరుగుప్రయాణంలో ఈనెల 17, 24, వచ్చేనెల 1వ తేదీన ఉంటుందని వెల్లడించారు. ఈ రైలు తిరుచానూర్ వెళ్లేటప్పడు నిర్ణీత తేదీల్లో అర్ధరాత్రి 1–13 గంటలకు, నాందేడ్ వెళ్లే క్రమంలో తెల్లవారుజామున 3–45 గంటలకు ఖమ్మం చేరుకుంటుందని తెలిపారు. దసరా, దీపావళి పండుగల వేళ స్వస్థలాలకు వెళ్లే వారి కోసం ఈ రైలు నడిపిస్తున్నట్లు పేర్కొన్నారు.
టీజీవోస్ రాష్ట అధ్యక్షుడికి సన్మానం
ఖమ్మంమయూరిసెంటర్: సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తెలంగాణ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటుకు కృషి చేసిన టీజీఈ జేఏసీ సెక్రటరీ జనరల్, టీజీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావును వసతి గృహ సంక్షేమ అధికారుల ఫోరం బాధ్యులు శనివారం సన్మానించారు. వసతి గృహ సంక్షేమ అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి పాటుపడాలని కోరారు. టీఎన్జీవోస్ నాయకుడు హరికృష్ణ కోణార్, వసతి గృహ సంక్షేమ అధికారుల ఫోరం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కోటపాటి రుక్మారావు, ఎన్.నాగేశ్వరరావుతో పాటు కె.తిరుపతిరావు, పి.హన్మంతరావు, సీహెచ్.నాగమణి, బి.వసంత, మాధురి, బాలాజీ, నర్సింహారావు, రమాదేవి, సరస్వతి తదితరులు పాల్గొన్నారు. అలాగే, ఇటీవల ఎన్నికై న మున్సిపల్ ఫోరం ల్లా కార్యవర్గ బాధ్యులు ఏలూరి శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఫోరం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఏ.సుధాకర్, జి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

జమలాపురంలో ప్రత్యేక పూజలు

జమలాపురంలో ప్రత్యేక పూజలు