● రీయింబర్స్‌మెంట్ బకాయిలపై విద్యాసంస్థల నిర్ణయం ● రేపటి నుంచి రెండు రోజులు నిరసనలు
ఖమ్మం సహకారనగర్: పేద, మధ్య తరగతి విద్యార్థుల చదువుకు ఇబ్బంది లేకుండా వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. నాటి నుంచి ఎందరో విద్యార్థులు ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఉచితంగా చదువుకుని ఉన్నత స్థానాలకు చేరారు. కానీ కొన్నేళ్లుగా ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో తమపై భారం పడుతోందని కళాశాలల యాజమాన్యాలు చెబుతున్నాయి. మూడేళ్లుగా బకాయిలు విడుదల కాక విద్యాసంస్థల నిర్వహణ ఇబ్బందిగా మారిందని, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేక నిరసనలకు నిర్ణయించామని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో డిగ్రీ, ఇంజనీరింగ్, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ కళాశాలలు వంద వరకు ఉండగా, రీయింబర్స్‌మెంట్ బకాయిలు రాక కళాశాలల నిర్వహణ, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది వేతనాలు, అద్దె చెల్లింపులకు కష్టంగా మారిందని యాజమాన్యాలు చెబతున్నాయి.
రౌండ్ టేబుల్ సమావేశంలో కార్యాచరణ
ఉమ్మడి జిల్లాలోని డిగ్రీ, పీజీ, ఫార్మసీ, ఇంజనీరింగ్ విద్యాసంస్థల బాధ్యులు ఖమ్మంలోని ఎస్‌బీఐటీ కళాశాలలో శనివారం సమావేశమయ్యారు. ఇంజనీరింగ్ విద్యాసంస్థల యాజమాన్యాల అధ్యక్షుడు చలసాని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లాకు చెందిన యాజమాన్యాలు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై మూడేళ్లుగా ప్రభుత్వ నిర్లక్ష్యంతో కళాశాలలు నడపడం కష్టంగా మారిందన్నారు. ఎస్‌బీఐటీ చైర్మన్ గుండాల కృష్ణ మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలన్నారు. కాగా, తొలిదశలో ఈనెల 15న సోమవారం విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు, యాజమాన్యాలతో ఖమ్మం అంబేద్కర్ సెంటర్ వద్ద నిరసన తెలుపుతామని, 16వ తేదీన కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో వివిధ కాలేజీల యాజమాన్య బాధ్యులు ఉషాకిరణ్, శ్రీధర్, కాటేపల్లి నవీన్‌బాబు, సత్యనారాయణ, ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.