
ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిద్దాం
జిల్లా జడ్జి రాజగోపాల్
లోక్ అదాలత్‌లో
4,771 కేసుల పరిష్కారం
ఖమ్మంలీగల్: రాజీ మార్గంలో కేసుల పరిష్కారం ద్వారా ఆరోగ్యకరమై సమాజ నిర్మాణానికి అంతా కలిసి రావాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ సూచించారు. ఖమ్మం జిల్లా కోర్టులో న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యాన శనివారం జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ లోక్‌అదాలత్‌లో రాజీ పడితే ఇరువర్గాలు గెలిచినట్లేనని తెలిపారు. కుటుంబ వివాదాల కేసుల్లో భార్యాభర్తలు కలిస్తే వారి సంతానంతో పాటు ఇరు కుటుంబాలు సంతోషంగా ఉంటాయన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తొండపు వెంకటేశ్వరరావు మాట్లాడగా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యాన కక్షిదారులకు భోజనం, తాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. న్యాయమూర్తులు దేవినేని రాంప్రసాదరావు, న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కే.వీ.చంద్రశేఖరరావుతో పాటు ఎం.కల్పన, టి,మురళీమోహన్, కాసరగడ్డ దీప, బి.రజిని, ఏపూరి బిందుప్రియ, వినుకొండ మాధవి, బి.నాగలక్ష్మి, అఖిల, లోక్ అదాలత్ సభ్యులు సంధ్యారాణి, ఎం.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
రూ.3.15 కోట్ల పరిహారం
లోక్‌అదాలత్‌లో భాగంగా పలు కేసులను న్యాయమూర్తులు పరిష్కరించారు. మోటార్ వాహన కేసు ను వాది తరపున న్యాయవాది పోట్రు వెంకయ్య చౌదరి, రాయల్ సుందరం బీమా కంపెనీ తరఫున బండారుపల్లి గంగాధర్ వాదించారు. ఈమేరకు కేసు పరిష్కారం కాగా వాదికి రూ.19.50 లక్షల అవార్డు కాపీతో పాటు పూల మొక్కను జిల్లా జడ్జి రాజగోపాల్ అందించారు. అలాగే దంపతులు పెద్దబోయిన మాధవి–లక్ష్మణ్ కేసు ప్రత్యేక కోర్టు న్యాయధికారి బి.నాగలక్ష్మి చొరవతో పరిష్కారమైంది. మొత్తంగా లోక్‌అదాలత్‌లో 4,771 కేసులను పరిష్కరించారు. ఇందులో మోటారు వాహన ప్రమాద బీమా కేసులు 80 ఉండగా, బాధితులకు పరిహారంగా రూ.3,16,71,251 ఇవ్వడానికి బీమా కంపెనీలు అంగీకరించాయి. అలాగే, క్రిమినల్, చెక్ బౌన్స్, కుటుంబ తగాదా, సివిల్ ఇతర కేసుల్లో ప్రతివాదులకు రూ.30,17,255 పరిహారం అందింది.

ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిద్దాం