
‘ఉపాధి’ ఉద్యోగులకు వేతనాలు కరువు
నేలకొండపల్లి: ఉపాధి హామీ పథకంలో విధులు నిర్వర్తిస్తున్న సాంకేతిక సహాయకులు(టీ.ఏ), క్షేత్ర సహాయకుల(ఎఫ్.ఏ)కే కాక ఏపీఓలు, ఇతర సిబ్బందికి వేతనాలు అందక అవస్థ పడుతున్నారు. టీఏలకు సర్వీస్ ఆధారంగా రూ.20 వేల నుంచి రూ.45 వేల వరకు, క్షేత్ర సహాయకులకు రూ.12,140 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. జిల్లాలో ఏపీఓలు 18మంది, ఈసీలు 16మంది, టెక్నికల్ అసిస్టెంట్లు 94మంది, క్షేత్ర సహాయకులు 348మంది, కంప్యూటర్ ఆపరేటర్లు 44మందితో పాటు ఇతర సిబ్బంది 20మంది విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి నెలల తరబడి వేతనాలు రాకపోవడంతో అర్ధాకలితో విధులు నిర్వర్తించాల్సి వస్తోందని వాపోతున్నారు. విధుల విషయానికి వస్తే గ్రామసభల్లో గుర్తించిన, రైతులు దరఖాస్తు చేసుకున్న పనులను సాంకేతిక సహాయకులు ఆన్‌లైన్‌లో నమోదు చేయిస్తారు. ఆపై కొలతల ప్రకారం పనులను పంచాయతీ కార్యదర్శి, ఇతర సిబ్బంది, సీనియర్ మేట్లకు అప్పగించాలి. అంతేకాక కొలతల ప్రకారం పనులు జరుగుతున్నాయా, లేదా అని ప్రతీ వారం తనిఖీ చేసి రికార్డులను జూనియర్ ఇంజనీర్‌కు సమర్పించాలి. ఇక క్షేత్ర సహాయకులు గ్రామాల్లో పనులను కూలీలతో చేయిస్తూ కొలతలు వేయాల్సి ఉంటుంది. అయితే, జిల్లాలో కంప్యూటర్ ఆపరేటర్ల, టెక్నికల్ అసిస్టెంట్ల నాలుగు నెలలుగా, మిగతా వారికి మూడు నెలలుగా వేతనాలు రాక ఇబ్బంది పడుతున్నందున ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు.