
వైరా రిజర్వాయర్ నుంచి సాగునీటి విడుదల
వైరా: వైరా రిజర్వాయర్ ఆయకట్టుకు కుడి, ఎడమ కాల్వల ద్వారా సాగునీటిని ఎమ్మెల్యే మాలోత్ రాందాస్‌నాయక్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నీటి విడుదలతో 22 వేల ఎకరాల్లో పంటల సాగుకు ఇబ్బందులు ఉండవని చెప్పారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, టీపీసీసీ కార్యదర్శులు నూతి సత్యనారాయణ, కట్ల రంగారావు, నాయకులు బొర్రా రాజశేఖర్, శీలం వెంకటనర్సిరెడ్డి, వడ్డె నారాయణరావు, దాసరి దానియేలు, దొడ్డా పుల్లయ్య, పొదిల హరినాథ్, ఏదునూరి సీతారాములు, బోళ్ల గంగారావు, సౌజన్య, వీరభద్రం, శేఖర్ గౌడ్, బొందయ్య, సాయి, రత్నం పాల్గొన్నారు.
అటు మూసి.. ఇటు వదిలి...
ఏన్కూరు: సీతారామ ప్రాజెక్టు నుంచి వచ్చే గోదావరి జలాలు వైరా రిజర్వాయర్‌కు చేరేలా ఏన్కూరులో లింక్ కెనాల్ నిర్మించారు. తద్వారా సాగర్ నుంచి కృష్ణా జలాల విడుదలలో జాప్యం జరిగినా గోదావరి జలాలతో పంటల సాగు సాఫీగా జరుగుతుందని భావించారు. ఈమేరకు రిజర్వాయర్ ఆయకట్టు రైతుల కలలు నెరవేరే సమయం ఆసన్నమైంది. మూడు రోజుల క్రితం అశ్వాపురం మండలం బీ.జీ.కొత్తూరు పంప్‌హౌస్ నుంచి గోదావరి జలాలను విడుదల చేయగా ములకలపల్లి మండలం మీదుగా లింక్ కెనాల్ ద్వారా సాగర్ కాల్వలోకి చేరాయి. అక్కడి నుంచి సత్తుపల్లి నియోజకవర్గానికి నీరు ప్రవహిస్తున్న నేపథ్యాన వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్ మంగళవారం 52 కి.మీ. వద్ద షట్టర్లు మూసివేసి రాయమాధారం వద్ద షట్టర్ ఎత్తి వైరా రిజర్వాయర్‌కు విడుదల చేశారు. కాగా, ఏన్కూరు నుంచి రాయమాధారం 38 కి.మీ. షట్టర్ వరకు సుమారు 14 కి.మీ. ప్రవహించిన గోదావరి జలాలు అక్కడి నుండి నిమ్మవాగు ద్వారా 22 కి.మీ. ప్రవాహం అనంతరం వైరా రిజర్వాయర్‌లోకి చేరనున్నాయి. అయితే, సత్తుపల్లి నియోజకవర్గానికి నీటి విడుదల ఆ తర్వాత ఉంటుందా, ఉండదా అన్న అంశంపై సందిగ్ధత నెలకొంది.

వైరా రిజర్వాయర్ నుంచి సాగునీటి విడుదల