
హౌస్‌ఫుల్!
సంక్షేమ గురుకులాలు..
ఖమ్మంమయూరిసెంటర్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంక్షేమ గురుకులాలపై విద్యార్థులు, తల్లిదండ్రులకు గురి కుదురుతోంది. ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖల గురుకులాల్లో ప్రవేశాలకు ఏటా పోటీ పెరుగుతుండడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. గతంలో సీట్లకు సరిపడా విద్యార్థులు మాత్రమే ప్రవేశపరీక్ష రాయడంతో దాదాపు అందరికీ సీట్లు వచ్చేవి. కానీ రెండు, మూడేళ్లుగా పరీక్ష రాస్తున్న విద్యార్థుల సంఖ్య పెరగడంతో పోటీ పెరిగింది. ఒక్కో గురుకులంలో వందల సంఖ్యలో ఉన్న సీట్లకు వేల సంఖ్యలో విద్యార్థులు పోటీ పడుతుండడం విశేషం. ఉమ్మడి జిల్లాలో ఎస్సీ, బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యాన గురుకులాలు కొనసాగుతుండగా, ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖల గురుకులాల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రధానంగా బీసీ గురుకులాల్లో గత ఏడాది 2వేల మేర సీట్లు ఖాళీగా మిగిలితే ఈసారి సీట్లన్నీ భర్తీ అవుతుండడంపై అధికారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
పెరుగుతున్న ఆదరణ
సంక్షేమ శాఖల పరిధిలోని గురుకులాల్లో చేరేందుకు గతంలో విద్యార్థులు అంతగా ఆసక్తి చూపించలేదు. అయితే, నాణ్యమైన విద్యతోపాటు పౌష్టికాహారం అందిస్తుండడంతో ఏటేటా పోటీ పెరుగుతోంది. గురుకులాల్లో 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు కార్పొరేట్ స్థాయి బోధన అందుతోంది. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, లెక్చరర్లు బోధిస్తుండగా, చదువుతోనే సరిపెట్టకుండా విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయడంపైనా దృష్టి సారిస్తున్నారు. క్రీడల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తుండడంతో విద్యార్థులు పలువురు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణిస్తున్నారు. వసతి విషయానికి వస్తే బెడ్ల నుంచి ఆహారం వరకు నాణ్యతగా ఉండం.. సన్నబియ్యంతో భోజనమే కాక మటన్, చికెన్, గుడ్డు, పాలు అందిస్తున్నారు. బాలికలు, బాలురకు వేర్వేరుగా విద్యనందించేలా ఏర్పాట్లు ఉండడంతో విద్యార్థినుల నుంచి కూడా ఆదరణ పెరుగుతోంది.
ఉమ్మడి జిల్లాలో బీసీ, ఎస్సీ గురుకులాలు, సీట్ల వివరాలు
బీసీ గురుకులాలు ఎస్సీ గురుకులాలు
జిల్లా పాఠశాలలు కళాశాలలు మొత్తం సీట్లు నిండినవి పాఠశాలలు కళాశాలలు మొత్తం సీట్లు నిండినవి
ఖమ్మం 13 13 8,674 8,370 11 11 7,040 6,564
భద్రాద్రి 11 10 6,880 6,450 07 07 4,480 4,190
ప్రవేశాలకు విద్యార్థులు, తల్లిదండ్రుల ఆసక్తి
ఎస్సీ, బీసీ గురుకులాల్లో
90శాతానికి పైగా సీట్లు భర్తీ
మిగిలిన సీట్ల కోసం పోటాపోటీగా
పైరవీలు
సీట్ల కోసం పైరవీలు..
గురుకులాల్లో చేరేందుకు వేల మంది
ప్రవేశ పరీక్ష రాస్తున్నారు. అయితే,
కొందరికి సీట్లు రాకపోగా, సీట్లు వచ్చినా పలువురు వివిధ కారణాలతో చేరడం లేదు. దీంతో బ్యాక్‌లాగ్ సీట్లలో చేరేందుకు విద్యార్థులు ప్రయత్నిస్తున్నారు.
ఈక్రమంలోనే ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల ద్వారా పిల్లలకు సీట్లు
ఇప్పించాలని తల్లిదండ్రులు సంక్షేమ శాఖల అధికారులకు చెప్పిస్తున్నారు. ఇంకొందరు ఓ అడుగు ముందుకేసి లేఖలతో
కార్యాలయాల చుట్టూ తిరుగుతుండడం గురుకులాలపై పెరిగిన ఆదరణకు
నిదర్శనంగా నిలుస్తోంది.
మెరుగైన ఉత్తీర్ణత
మునుపెన్నడూ లేనివిధంగా ఈ విద్యాసంవత్సరం బీసీ గురుకులాల్లో చేరేందుకు విద్యార్థుల్లో ఆసక్తి పెరిగింది. గత ఏడాది పదో తరగతి, ఇంటర్‌లో మెరుగైన ఉత్తీర్ణత నమోదు కావడమే కాక పలువురు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు. గురుకులాల్లో మెరుగైన విద్యతో పాటు మంచి సౌకర్యాలు ఉండడం విద్యార్థుల సంఖ్య పెరగడానికి కారణంగా భావిస్తున్నాం. – సీహెచ్.రాంబాబు,
ఆర్‌సీఓ,
బీసీ గురుకులాలు

హౌస్‌ఫుల్!

హౌస్‌ఫుల్!