
వరంగల్ పాలు.. ఖమ్మంలో అమ్మకం
● తక్కువ ధరతో ‘విజయ’ పాల విక్రయంపై అనుమానాలు ● విచారణ మొదలుపెట్టిన ప్రత్యేకాధికారి
ఖమ్మంవ్యవసాయం: ప్రభుత్వ పాడి పరిశ్రమ ‘విజయ’ పాల విక్రయాల్లో అక్రమాలు జరుగుతున్నాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పాత జిల్లాల వారీగా యూనిట్లు ఉండగా ఎక్కడికక్కడ డిస్ట్రిబ్యూటర్లను నియమించి పాలు సరఫరా చేసి విక్రయాలు చేపడుతున్నారు. అయితే, ఉమ్మడి ఖమ్మం జిల్లా అంతటా ఖమ్మం డెయిరీ ద్వారా సరఫరా చేసే పాలనే విక్రయించాల్సి ఉండగా వరంగల్‌లో ప్యాకింగ్ అయిన పాలు అమ్ముతున్నట్లు వెలుగు చూడడం చర్చనీయాంశంగా మారింది.
తక్కువ ధరకే అమ్ముతూ...
లీటర్ విజయ పాల ధరను ప్యాకెట్‌పై రూ.74గా ముద్రిస్తారు. డిస్ట్రిబ్యూటర్లకు రూ.7 కమీషన్ పద్ధతిపై రూ.67కు సరఫరా చేస్తారు. ఆపై డిస్ట్రిబ్యూటర్లు రిటైల్ వ్యాపారులకు రూ.70 నుంచి రూ.72 వరకు అందిస్తే వారు ఎమ్మార్పీతో అమ్ముతారు. రాష్ట్రమంతటా ఇలాగే జరుగుతున్నా కొద్ది రోజులుగా ఖమ్మంతో పాటు, జిల్లాలోని పలు ప్రాంతాల్లో రిటైల్ వ్యాపారులకు స్థానిక డిస్ట్రిబ్యూటర్‌తో సంబంధం లేకుండా పాలు సరఫరా అవుతున్నాయి. అంతేకాకుండా రూ.74 ఎమ్మార్పీ ముద్రించి ఉన్న ప్యాకెట్లను రిటైల్ వ్యాపారులకు రూ.62కే ఇస్తుండడం, ఇది ఖమ్మం డిస్ట్రిబ్యూటర్ ఇచ్చే ధర కంటే రూ.10 తక్కువగా ఉండడంతో అటే మొగ్గు చూపుతున్నారు. వరంగల్ డెయిరీ నుంచి మహబూబాబాద్ డిస్ట్రిబ్యూటర్‌కు సరఫరా అయ్యే పాలను వాహనంలో ఖమ్మం తీసుకొచ్చి విక్రయిన్న విషయాన్ని ఖమ్మం డిస్ట్రిబ్యూటర్ నరేష్ ఇటీవల గుర్తించి డెయిరీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. అంతేకాక మంగళవారం కాపు కాసి మహబూబా బాద్ నుంచి వచ్చిన పాల వాహనాన్ని పట్టుకుని ఖమ్మం డెయిరీ యూనిట్‌లో అప్పగించారు. ఆపై ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వగా డిప్యూటీ డైరెక్టర్ ధన్‌రాజ్ చేరుకుని విచారణ చేపట్టారు.
అసలా.. నకిలీవా?
వరంగల్ విజయ డెయిరీ పేరిట ఖమ్మం తీసుకొస్తున్న పాలను తక్కువ ధరకు విక్రయిస్తుడడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్యాకెట్లపై విజయ లోగో ఉన్నప్పటికీ డెయిరీ నుంచి డిస్ట్రిబ్యూటర్లకు లీటర్ పాలను రూ.67కు ఇస్తుండగా మహబూబాబాద్ వ్యాపారి రూ.62కే ఇస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఇన్ వాయిస్‌లు విక్రయిస్తుండడం, ప్యాకెట్లపై కోడ్‌లో తేడాను గుర్తించిన అధికారులు పాలు అసలువా, నకిలీవా అన్న అంశాన్ని నిర్ధారించేందుకు శాంపిళ్లను హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపించినట్లు విచారణ అధికారి ధన్‌రాజ్ తెలిపారు. ఈ విచారణలో ఖమ్మం డీడీ కోడిరెక్క రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.