
అండర్–19 క్రీడాపోటీలపై నీలినీడలు
ఖమ్మం స్పోర్ట్స్: రాష్ట్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యాన ఏటా నిర్వహించే అండర్–19 స్థాయి క్రీడాపోటీల నిర్వహణపై ఈసారి స్పష్టత రావడం లేదు. ఏటా జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయికి, ఆతర్వాత జాతీయ స్థాయికి ఎంపిక చేస్తారు. అయితే, ఇప్పటికే జాతీయ స్థాయి పోటీల క్యాలెండర్ విడుదలైనా జిల్లాలో పోటీలు ఎప్పుడు నిర్వహిస్తారో ఎవరూ చెప్పలేకపోతున్నారు. అయితే, పోటీల నిర్వహణలో కీలకమైన ఎస్‌జీఎఫ్ కార్యదర్శిగా ఎవరిని నియమించాలో తెలియక ఇంటర్ విద్యాశాఖ అధికారులు సందిగ్ధంలో పడినట్లు సమాచారం.
ఒకే ఒక్క పీడీ
పాఠశాలల స్థాయిలో సత్తా చాటిన క్రీడాకారులు ఇంటర్ విద్య కోసం జూనియర్ కళాఽశాలల్లో చేరాక ఆ స్థాయిలో సహకారం అందడంలేదనే విమర్శలు ఉన్నాయి. దాదాపు ఆరేళ్లుగా జిల్లాలో ఇదే పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులను రాష్ట్రస్థాయి పోటీలకు వెళ్లాలని సూచించడం తప్ప శిక్షణ ఇవ్వడం, వెంట వెళ్లడం సాధ్యపడడం లేదు. కొన్నేళ్ల క్రితం వరకు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఫిజికల్ డైరెక్టర్లు ఉండడంతో విద్యార్థులకు ప్రోత్సాహం, శిక్షణే కాక అండర్–19 క్రీడా పోటీల నిర్వహణ ఉత్సాహంగా సాగేది. కానీ పీడీలు ఒక్కరొక్కరుగా రిటైర్డ్ అవుతుండగా ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ కాలేజీల్లో ఒకే ఒక్కరు మిగిలారు. ఖమ్మంలోని నయాబజార్ కాలేజీలో సదరు పీడీ విధులు నిర్వర్తిస్తుండగా ఆ పీడీ కూడా కార్యదర్శిగా విధులు నిర్వర్తించేందుకు సుముఖంగా లేరని సమాచారం. ఆతర్వాత పీడీల కొరతతో కేజీబీవీ ఫిజికల్ డైరెక్టర్‌ను నియమించారు. ఈసారి వీరిద్దరు ఆసక్తిగా లేకపోవడంతో కార్యదర్శిగా ఎవరిని నియమించాలో తెలియక జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో క్రీడలపై ఆసక్తి కలిగిన సీనియర్ అధ్యాపకులు లేదా ప్రభుత్వ గురుకులాల్లోని సీనియర్ పీడీని నియమించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
పీడీల నియామకం ఎప్పుడో?
రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ కళాశాలల్లో కొన్నేళ్లుగా పీడీల నియామకం జరగడం లేదు. రెగ్యులర్ పీడీలను నియమించకున్నా ఇతర సబ్జెక్టుల మాదిరి కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో తీసుకుంటే విద్యార్థులకు శిక్షణ అందుతుందని చెబుతున్నారు. బీపీఈడీ, ఎంపీఈడీ పూర్తిచేసి ప్రైవేట్ కళాశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న సీనియర్లకు అవకాశం కల్పిస్తే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అటు పీడీలు లేక, ఇటు ఎస్‌జీఎఫ్ కార్యదర్శి నియామకంపై స్పష్టత రాక ప్రతిభ ఉన్న విద్యార్థులు క్రీడల్లో రాణించే అవకాశాలు కోల్పోతున్నందున అధికారులు స్పందించాలని క్రీడాసంఘాల బాధ్యులు కోరుతున్నారు.
ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి
నియామకంపై అస్పష్టత
జిల్లాలో రెగ్యులర్ పీడీలు లేక జాప్యం