
పారిశుద్ధ్య నిర్వహణ, పచ్చదనంపై దృష్టి
● కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ● వన మహోత్సవానికి ఏర్పాట్లు చేయాలని సూచన
ఖమ్మం సహకారనగర్: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపర్చడమే కాక మొక్కల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఆయన స్థానిక సంస్థల పనితీరుపై అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వన మహోత్సవం ద్వారా అవెన్యూ, బ్లాక్ ప్లాంటేషన్‌పై శ్రద్ధ కనబర్చాలని, ఇదే సమాయన రహదారుల వెంట పిచ్చి మొక్కలు తొలగించాలని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో కూడా రెండెకరాల చొప్పున అర్బన్ పార్క్ ఏర్పాటుకు స్థలాలను గుర్తించి మొక్కలు నాటాలన్నారు. అలాగే, సీజనల్ వ్యాధుల నియంత్రణకు పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపర్చాలని కలెక్టర్ సూచించారు. ఆతర్వాత ఆస్తి పన్నుల వసూళ్లు, ఇందిరా మహిళా డెయిరీ ఏర్పాటుపై సూచనలుచేశారు. జెడ్పీ సీఈఓ దీక్షారైనా, డీఆర్డీఓ సన్యాసయ్య, డీపీఓ ఆశాలత, డీఎంహెచ్‌ఓ కళావతిబాయి, మున్సిపల్ కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు.
బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి
కలెక్టరేట్‌లో అధికారులు, ఉద్యోగులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. కలెక్టరేట్ ఆవరణలోని వివిధ విభాగాలను పరిశీలించిన ఆయన హాజరుపై ఆరా తీశారు. ప్రతీ శాఖలోని ఉద్యోగుల హాజరు బయో మెట్రిక్ ద్వారా నమోదు చేయాలని తెలిపారు. ఆనంతరం క్యాంటీన్‌ను పరిశీలించిన కలెక్టర్ టీ తాగి డబ్బు చెల్లించారు. డీఆర్‌ఓ ఏ.పద్మశ్రీ, ఏఓ కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఆయిల్‌పామ్ తోటలకు డ్రిప్
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో ఆయిల్ పామ్ తోటలకు యుద్ధప్రాతిపదికన డ్రిప్ సౌకర్యం కల్పించాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఉద్యాన, వ్యవసాయ, విద్యుత్ శాఖల అధికారులతో సమావేశమైన ఆయన ఆగస్టు 15నాటికి జిల్లా లక్ష్యం మేర ఆయిల్ పామ్ మొక్కలు నాటడమే కాక డ్రిప్ సౌకర్యం కల్పించాలన్నారు. జిల్లా ఉద్యాన, వ్యవసాయ శాఖాధికారులు ఎం.వీ.మధుసూదన్, డి.పుల్లయ్య, విద్యుత్ ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి పాల్గొన్నారు.

పారిశుద్ధ్య నిర్వహణ, పచ్చదనంపై దృష్టి