
నానో యూరియాతో తగ్గనున్న వ్యయం
కొణిజర్ల: సంప్రదాయ గుళికల యూరియా వాడకంతో పోలిస్తే నానో యూరియా వినియోగం ద్వారా రైతులకు ఖర్చు తగ్గుతుందని ఖర్చు తగ్గడమే కాక పర్యావరణ పరిరక్షణకు పాటుపడినట్లవుతుందని జిల్లా వ్యవసాయ శాఖాధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. కొణిజర్ల మండలం తుమ్మలపల్లిలో నానో యూరియా వాడకంపై మంగళవారం రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ నానో యూరియా పిచికారీ వల్ల నేరుగా ఆకులపై పడి మొక్కకు పోషకాలు చేరతాయని తెలిపారు. తద్వారా దిగుబడి 8 – 10 శాతం పెరుగుతుందని, గాలిలో ఆవిరయ్యే అవకాశం ఉండదని చెప్పారు. ఈకార్యక్రమంలో ఏఓ బాలాజీ, ఏఈఓ కుమార్‌రాజా పాల్గొన్నారు.
ఉపకార వేతనాలకు మరో అవకాశం
ఖమ్మంమయూరిసెంటర్: 2024–25 విద్యాసంవత్సరం ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 9, 10వ తరగతులు చదివిన బీసీ విద్యార్థుల నుండి ఉపకార వేతనాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ అధికారి జి.జ్యోతి తెలిపారు. గతంలో దరఖాస్తు చేసుకోలేని విద్యార్థులు ఇప్పుడు తెలంగాణ ఈ–పాస్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డ్, జాయింట్ బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్ జిరాక్స్ పత్రాలు జతపర్చి దరఖాస్తు చేసుకున్నాక ఆయా పత్రాలను తమ కార్యాలయంలో అందజేయాలని తెలిపారు.
లాభాల పంట..
ఆయిల్‌పామ్
తల్లాడ: రైతులు ఆయిల్‌పామ్ సాగుతో లాభాలు గడించొచ్చని జిల్లా ఉద్యానవన శాఖాధికారి ఎం.వీ.మధుసూదన్ తెలిపారు. తల్లాడ మండలం తెలగారంలో మంగళవారం పలువురు రైతులు ఆయిల్‌పామ్ మొక్కలు నాటుతుండగా మధుసూదన్ పరిశీలించి మాట్లాడారు. ఆయిల్‌పామ్ ఒకసారి నాటితే 30ఏళ్ల వరకు ఆదాయం వస్తుందని, ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడల బెడద ఉందని తెలిపారు. అంతేకాక ప్రభుత్వం రాయితీపై మొక్కలు ఇస్తూనే నిర్వహణ ఖర్చులు కూడా చెల్లిస్తున్నందున రైతులు ముందుకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఉద్యాన అధికారి నగేష్, ఏఓ ఎం.డీ.తాజుద్దీన్, ఆయిల్‌ఫెడ్ ఉద్యోగులు పాల్గొన్నారు.
కేజీబీవీల్లో నియామకాలకు తుది జాబితా
ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని వివిధ కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న సీఆర్‌టీ, పీజీ సీఆర్‌టీ పోస్టులకు సంబంధించి ఆరుగురు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు డీఈఓ సామినేని సత్యనారాయణ తెలిపారు. ఈమేరకు తుది జాబితాను డీఈఓ కార్యాలయంలో ప్రదర్శించామని వెల్లడించారు. ఇందులో పేర్లపై అభ్యంతరాలు ఉంటే ఈనెల 17వ తేదీ సాయంత్రం 5గంటలలోగా తమ కార్యాలయంలో అందజేయాలని సూచించారు.
నాగులవంచ సొసైటీకి అవార్డు
చింతకాని: రైతులకు ఉత్తమ సేవలందించినందుకు గాను మండలంలోని నాగులవంచ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘానికి అవార్డు లభించింది. రైతులకు రుణాల పంపిణీ, ఇతర అంశాల్లో మెరుగైన పనితీరుతో అవార్డు ప్రకటించారు. ఈమేరకు హైదరాబాద్‌లోని నాబార్డు కార్యాలయంలో మంగళవారం సమావేశంలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా సొసైటీ చైర్మన్ నల్లమోతు శేషగిరిరావు, సీఈఓ యాలమూడి శ్రీనివాసరావు అవార్డు అందుకున్నారు.

నానో యూరియాతో తగ్గనున్న వ్యయం

నానో యూరియాతో తగ్గనున్న వ్యయం