
ఇది ఆడబిడ్డల ప్రభుత్వం
సత్తుపల్లి: ఎవరికి ఓటు వేశారు, ఏ పార్టీ, ఏ కులం అని అడగకుండా పేదరికమే అర్హతగా సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా.. ఆడబిడ్డల అభ్యున్నతే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. సత్తపల్లిలో గురువారం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి అధ్యక్షతన నిర్వహించిన ఇందిరమ్మ మహిళాశక్తి సంబు రాల్లో ఆయన మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి రైతులకు ఉచిత కరెంట్ అందిస్తే తమ ప్రభుత్వం 200యూనిట్ల మేర ఉచిత విద్యుత్ ఇస్తోందని, వైఎస్సార్ హయాంలో మహిళా సంఘాలకు అమలైన పావలా వడ్డీ రుణాలను సైతం పునరుద్ధరించామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలోని లోపాలను సరిచేస్తూ.. ఎన్నికల సమయంలో చెప్పినవి, చెప్పనవి కూడా ఏడాదిన్నరలో అమలుచేశామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు, సన్నబియ్యం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుచేస్తున్నామని వివరించారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ అరకొరగా సంక్షేమ కార్యక్రమాలు అమలుచేసిందే తప్ప పేదలకు ఇళ్లు ఇవ్వాలనే ఆలోచన చేయలేదని పొంగులేటి విమర్శించారు. ఎన్నికలు వచ్చినప్పుడే డబుల్ బెడ్‌రూం ఇళ్ల పేరిట హడావుడి చేసిన ఆ పార్టీ నేతలు ఏటా రెండు లక్షలు ఇళ్లు ఇచ్చినా పదేళ్లలో 20లక్షల మంది పేదలకు లబ్ధి జరిగేదని చెప్పారు. ఈనేపథ్యాన ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చిన ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని మంత్రి కోరారు. కాగా, సత్తుపల్లిలో మహిళా శక్తి భవనానికి స్థలం సేకరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
మహిళల పేరిటే పథకాలు
సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వాన కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ తెలిపారు. మహిళల పేరిట ఇప్పటికే బస్సులు ఇవ్వగా, త్వరలోనే రైస్‌మిల్లులు, క్యాంటిన్, జిరాక్స్ సెంటర్లు వస్తాయని చెప్పారు. నియోజకవర్గానికి అదనంగా 1,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంపై మంత్రి పొంగులేటికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అదనపు కలెక్టర్ పి.శ్రీజ, ఆర్డీఓ రాజేంద్రగౌడ్, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, వ్యవసాయ మార్కెట్ల చైర్మన్లు దోమ ఆనంద్, నీరజాదేవి, నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, శివవేణు, చల్లగుళ్ల నర్సింహారావు, నారాయణవరపు శ్రీనివాసరావు, చల్ల గుండ్ల కృష్ణయ్య, ఎం.డీ.కమల్‌పాషా, గాదె చెన్నారావు, సందీప్‌గౌడ్, దూదిపాల రాంబాబు, గోలి ఉషారాణి, తోట సుజలరాణి, పద్మజ్యోతిరెడ్డి, కుమారి తదితరులు పాల్గొన్నారు.
గత ప్రభుత్వ లోపాలన్నీ సరిచేస్తున్నాం
ఏ ఎన్నికలు వచ్చినా
మమ్మల్ని ఆశీర్వదించండి
రాష్ట్ర రెవెన్యూ శాఖ
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఇది ఆడబిడ్డల ప్రభుత్వం