● వర్షాభావంతో వడబడుతున్న చేన్లు ● ఇంకో పక్క వేసవిని తలపిస్తున్న ఎండలు ● లక్ష్యం మేర నమోదు కాని పంటల సాగు
ఫై ఫొటోలో ఎడమ చివర ఉన్న రైతు తల్లాడకు చెందిన అక్కల ప్రభాకర్‌రెడ్డి. మూడెకరాల వరి సాగుకు నారు పెంచాడు. జూన్‌లో నారు పోయగా వర్షాలతో బాగానే ఎదిగింది. కానీ ఆతర్వాత వర్షాలు లేక నారుమడి ఎండిపోయే స్థితికి చేరింది. దీంతో ట్యాంకర్ ద్వారా నీరు తెప్పించి నారుమడికి పట్టాడు. ఏడు ట్యాంకర్ల నీరు పడితే నారుమడి తడిసిందని చెబుతున్నాడు.
ఖమ్మంవ్యవసాయం/తల్లాడ/ముదిగొండ: వానదేవుడి కటాక్షం లేకపోవడం.. ఇంకోపక్క వేసవిని తలపించేలా ఎండలు దంచి కొడుతుండడంతో పంటల సాగుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే మొలకెత్తిన పత్తి మొక్కలు, వరినార్లు ఎండిపోయే దశకు చేరడంతో రక్షించేందుకు రైతులు నానాపాట్లు పడుతున్నారు. ఇక వర్షాభావ పరిస్థితుల్లో జిల్లాలో ఇప్పటివరకు లక్ష్యం మేర పంటల సాగు కాకపోవడం గమనార్హం. జూన్‌లో సాధారణ వర్షపాతం 131.2 మి.మీ.కు గాను 123.9 మి.మీ. నమోదు కాగా, ఈనెల 16వ తేదీ వరకు వరుణుడు కరుణ చూపలేదు. ఇప్పటివరకు 130 మి.మీ.ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా కేవలం 84.2 మి.మీ.గానే నమోదైంది. ఇక గురువారం కొన్నిచోట్ల వర్షం కురిసినా పంటలకు పెద్దగా ఉపయోగపడే పరిస్థితి కానరావడం లేదు. జిల్లాలోని కారేపల్లి, రఘునాథపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి, ముదిగొండ, చింతకాని, ఖమ్మం అర్బన్, వైరా, బోనకల్, మధిర, ఎర్రుపాలెంలో లోటు వర్షపాతం ఉండగా, మిగిలిన పది మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది.
వానాకాలమా.. ఎండాకాలమా?
ప్రస్తుతం జిల్లాలో మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు వేసవిని తలపిస్తున్నాయి. ఉదయం నుంచే ఎండ మొదలై మధ్యాహ్నానికి తీవ్రరూపం దాల్చి గరిష్టంగా 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదవుతోంది. గురువారం వైరా మండలంలో గరిష్టంగా 39.2 డిగ్రీలు, మిగిలిన మండలాల్లో సగటున 38 డిగ్రీలుగా నమోదైంది. ఉష్ణోగ్రతలకు తోడు ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
వడబడుతున్న పంటలు
వర్షాభావ పరిస్థితులకు తోడు ఎండల కారణంగా పంటలు వడబడుతున్నాయి. మే చివరి వారం, జూన్‌లో అప్పుడప్పుడు కురిసిన అకాల వర్షాలతో పత్తి, అపరాల పంటలను సాగు చేశారు. కానీ ఈ పంటలు ప్రస్తుత పరిస్థితులతో బెట్టకేశాయి. మరోపక్క అనుకూలించని వర్షాలతో మెట్ట పంటల సాగు లక్ష్యం కూడా చేరలేదు. పత్తి పైరల్లో ఎదుగుదల లోపించగా, పెసర పైర్లు కూడా వడబడుతున్నాయి. ఇక జూలై 15 నాటికి పత్తి సాగు లక్ష్యం 2,15,643 ఎకరాలకు చేరాల్సి ఉన్నా మరో 10వేల ఎకరాలు వెనకబడి ఉంది. పెసర, మొక్కజొన్న పరిస్థితి అలాగే ఉండగా కంది, వేరుశనగ పంటల సాగు మొదలేకాలేదు.
వరి దారుణం
జిల్లాలో ప్రధాన పంటగా సాగయ్యే వరి ఎక్కడా ఊపందుకోలేదు. జిల్లాలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 2,87,928 ఎకరాలు కాగా ఇప్పటి వరకు 64,989 ఎకరాల్లో నాట్లు వేశారు. ఇంకా 87,462 ఎకరాలకు సరిపడా నారు పోసినట్లు అంచనా. అయితే, ఈ నారును కాపాడుకునేందుకు బోర్లు, బావుల ద్వారా నీరు పడుతున్నారు. కాగా, వర్షాలు లేకున్నా కృష్ణా, గోదావరి జలాలు జిల్లాకు చేరడంతో నాట్లు మొదలయ్యే అవకాశముంది. ఇక సాగర్ జలాలు విడుదల చేసినా చివరి భూములకు అందడం లేదని.. రైతుల ఇక్కట్లను పరిగణనలోకి తీసుకుని కాల్వలు మరమ్మతు చేయించాలని పలువురు కోరుతున్నారు.
జిల్లాలో ప్రధాన పంటల సాగు వివరాలు (ఎకరాల్లో)
పంట సాధారణ సాగు ఇప్పటి వరకు సాగు
వరి 2,87,928 64,989
పత్తి 2,15,648 2,04,857
మొక్కజొన్న 2,327 922
పెసర 16,838 12,684
మిర్చి 75,407 390
కూరగాయలు 242 60
యూరియా ద్రావకం పిచికారీ చేయాలి
వర్షాభావం నేపథ్యాన మొక్కల రక్షణకు యూరియా ద్రావకాన్ని పిచికారీ చేయాలి. యూరియా ద్రావకంతో పాటు నానో యూరియాను కూడా అధికారుల సూచనలతో పంటలపై పిచికారీ చేస్తే వడబాటు కాకుండా 15 రోజులు ఉంటాయి. – ధనసరి పుల్లయ్య,
జిల్లా వ్యవసాయాధికారి
రెండు సార్లు విత్తాను..
పదెకరాల్లో పత్తి సాగుకు సిద్ధమై గింజలు నాటితే మొలకెత్తలేదు. దీంతో రెండోసారి విత్తాం. మొక్కలు వచ్చినా సరిగా ఎదగడం లేదు. బావి పక్కనే బోరు వేసి ఆ నీటిని బావిలోకి మళ్లించి పంట అవసరాలకు వాడుతున్నా.
– పుచ్చకాయల అప్పారావు, రైతు,
అమ్మపేట, ముదిగొండ మండలం
పంటలపై వరుణుడి పగ
పంటలపై వరుణుడి పగ
పంటలపై వరుణుడి పగ
పంటలపై వరుణుడి పగ
పంటలపై వరుణుడి పగ