
బీఎల్‌ఓలకు సాంకేతిక శిక్షణ
● స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌కు సిద్ధం ● ఓటరు జాబితా ప్రక్షాళనకు వచ్చేనెల నుంచి ప్రత్యేక కార్యక్రమం
నేలకొండపల్లి: స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగనున్నాయనే ప్రచారం జరుగుతుండగా.. ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా సిద్ధంగా ఉండేలా అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈమేరకు బీఎల్‌ఓ(బూత్ లెవల్ ఆఫీసర్)లకు ఓటర్ల జాబితా తయారీతో పాటు మార్పులు, చేర్పులు, సవరణపై శిక్షణ ఇస్తున్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై శిక్షణ ఇచ్చేందుకు నియోజకవర్గానికి ఆరుగురు మాస్టర్ ట్రెయినర్లను నియమించారు.
అవగాహన
ఎన్నికల సంఘం ద్వారా బీఎల్‌ఓ యాప్, ఓటర్లు హెల్ప్‌లైన్ యాప్‌ల్లో ఇటీవల మార్పులు చేశారు. ఈ మార్పులపై బీఎల్‌ఓలకు మాస్టర్ ట్రెయినీలు అవగాహన కల్పిస్తున్నారు. ఓటరు నమోదు, సవరణ దరఖాస్తులను నేరుగా యాప్‌లో అప్‌లోడ్ చేయడం, ఆపై పరిష్కరించే విధానాన్ని వివరిస్తున్నారు. అంతేకాక శిక్షణ ముగియగానే పరీక్ష నిర్వహించి బీఎల్‌ఓల అవగాహనను పరీక్షించనున్నారు. కాగా, కొత్త ఓటర్ల నమోదుతో పాటు తొలగింపు, సవరణల కోసం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని ప్రయోగాత్మాకంగా బిహార్ రాష్ట్రంలో చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఆగస్టు నుంచి దేశమంతా నిర్వహించనుండడంతో బీఎల్‌ఓలు సాంకేతిక అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. కార్డులో గతంలో ఉన్న ఫొటోతో పాటు చిరునామా మార్పు తదితర అంశాలను ఆన్‌లైన్‌లో చేసేల అవగాహన కల్పిస్తున్నారు. ఈ విషయమై రాష్ట్ర స్థాయిలో శిక్షణ పొందిన మాస్టర్ ట్రెయినర్ల ద్వారా ఈనెల 17వ తేదీ నాటికి బీఎల్‌ఓలకు శిక్షణ పూర్తిచేయాలనే లక్ష్యంతో అధికారులు ఉన్నారు.
ఎన్నికల సంఘం ఆదేశాలతో..
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు షెడ్యూల్ ప్రకారం మండలాల వారీగా బీఎల్‌ఓలకు శిక్షణ ఇస్తున్నాం. యాప్‌ల్లో చేసిన మార్పులు, ఓటర్ల జాబితా సవరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నాం. సాంకేతికపరమైన సందేహాలన్నీ చేస్తున్నాం.
– పెద్ది జగన్నాధం, మాస్టర్ ట్రెయినర్, ఖమ్మం

బీఎల్‌ఓలకు సాంకేతిక శిక్షణ